పద్యం తెలుగు వారి ఆస్తి. అసమాన శేముషీ మనీషులైన తెలుగు వారసత్వ సంపద. చరిత్ర కందిన తొలి తెలుగు కంద పద్యకర్త జినవల్లభుని నుండి నేటి దాకా ఈ నేల మీద కావ్యమై, శతకమై, మరో రూపమై వర్ధిల్లుతునే ఉంది. దీనికి తోడు సంస్కృత భాషలో ఉన్నప్పటికీ కేవలం తెలుగులోనే ప్రధానంగా కనిపించే అవధాన విద్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవధాన విద్య ఆంధ్రుల ఉపజ్ఞోపనత విద్య. తొలి నాళ్ళ సంగతి సరే సరి! కానీ ఇవాళ్ళ కూడా మన యువత అవధాన విద్యను చేపట్టి పద్యాన్ని పల్లకిలో మోస్తున్నారు…! అలా తెలంగాణ నేల నుండి పద్యాన్ని తన వాహికగా ఎన్నుకుని రాస్తున్న కవి, రచయిత, పాఠ్య పుస్తక రచయిత, సభా వ్యాఖ్యాత ‘అవధాన యువకేసరి’ అవుసుల భాను ప్రకాష్. ఈయన 24 డిసెంబర్, 1979న మెదక్‌లో పుట్టాడు. శ్రీమతి శశిరేఖ – శ్రీ అవుసుల గోపాల్ భాను ప్రకాష్ అమ్మా నాన్నలు.
తెలుగు సాహిత్యంలో ఎం.ఎ చదివి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న భానుప్రకాష్ డిగ్రీ రెండవ సంవత్సరం చదివేప్పుడే ‘భారతీ నీకై అక్షర హారతీ’ పేర కంద అర్ధశతకాన్ని రాశాడు. ‘యుగయుగాల తెలుగు సాహిత్యం-అన్వయ సూత్రం’ ఈయన ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం. ‘తెలంగాణలో అవధానం-సమగ్ర పరిశీలన’ అంశంపై పిహెచ్.డి చేస్తున్నాడు. ‘హైందవవీరా, ఆవాహన, జర బోలో శంకర, బంగారు తెలంగాణ’ శతకం ఈయన పద్య రచనలు. ‘అంతర్నేత్రం’ వచన కవితా సంపుటి, ప్రణయ మధురిమ’ రుబాయీలు, ‘మానవ భారతం’ వచనకావ్యం, ‘కవి తరంగిణి’ గేయ కావ్యం ఇతర రచనలు. ఇంకా ‘అమృతమూర్తులు, తెలంగాణ వీరుడా!, అవధాన తెలంగాణ’ వ్యాసాలు ఇతర రచనలు. తెలంగాణ సాహిత్య అకాడమి కోసం ‘సంగారెడ్డి జిల్లా సాహిత్య చరిత్ర’ రాశాడు. ఇవేకాక ‘మెతుకుసీమ కవనసీమ, సైనికార్చన, పద్య ప్రభంజనం, పచ్చదనం’ వంటివి ఈయన సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు.
పిల్లలకోసం పద్యాలతో పాటు చక్కని గేయాలూ రాశాడీ యువ అవధాని. వాటిలో ‘అల్లరెపుడు చేయను/ చిల్లరగా తిరగను/ టైముంటే రాసుకుంట/ టైముంటే చదువుకుంట/ వట్టిగమాట్లాడనెపుడు/ వట్టిగ కొట్లాడనెపుడు’ అంటూ బడి బాలుడై గ్రామీణ బాలుని అంతరంగంగా ఆవిష్కరించాడు ఒకచోట. ఇంకోచోట ‘ఆడుదాం పాడుదాం/ హాయిగ చదువుదాం/ ఆడుకొంటు పాడుకొంటు/ హాయిగా చదువుదాం/ మొద్దునిదర విడిచిపెట్టి/ బద్ధకాన్ని వదిలిపెట్టి/ చదువుమీద శ్రద్ధ పెట్టి/ లక్ష్యంపై దృష్టి పెట్టి/ ఆడుకొంటు పాడుకొంటు/ హాయిగా చదువుదాం!’ అని రాశాడు. అంతేకాదు, తన గేయాలను పిల్లలతో కలిసి ఆడి పాడి యూట్యూబ్’ద్వారా కూడా అందరికీ అందుబాటులోకి తెస్తున్నాడు.
జన్మత: బంగారం పని తెలిసిన భాను తాను పట్టిన ప్రతిదాన్నీ ఒడుపుతో చేపట్టి స్వర్ణమయం చేశాడు. అది ఆయన అక్షరాల్లో కనిపిస్తుంది. అవుసుల భాను ప్రకాష్ పద్య విద్యా రసవేది… పద్యాన్ని హృద్యంగా… అందంగా రాయగల పద్యకవి. అందులోనూ ‘కందాన్ని రసవన్మాకందం’గా రాయగల నేర్పు తెలిసినవాడు. పిల్లల గురించి ఎంతో ఆలోచించినవాడు… అందుకే ‘శ్రీకరమగు బాల్యమ్మది/ శ్రీకరముగ వెల్గజేయు శ్రేయములోలుకన్’ అంటూ ఈ ‘ట్రెండింగ్ పద్యాలు’ చెప్పిన కవి భాను, పిల్లలకు తాను చెప్పాలనుకున్న ప్రతిదీ కందంలోనే చెప్పాడు. తన తెలుగు కందపద్యంతో పాటు, దానిని ఆంగ్లం లోనూ అదే విధంగా చెబుతాడు. ‘చదువే నీ అయుధమౌ/ చదువే నీ విలువ బెంచు చక్కగ చదివెరు!’, ‘వ్యాయామము చేయుమురా/ వ్యాయామమె నిన్ను తీర్చు వసుధను దృఢమై’, ‘మితముగ తినుమెప్పుడు/ మితముగ మాట్లాడు నీవు మిగుల ఫలమ్మౌ!’ అంటూ చక్కని బుద్ధులను చెప్పాడు. భాను ప్రకాష్ మరోచోట ఎలా ఉండాలో, ఎలా ఉండగూడదో, ఏమి చేయాలో, చేయకూడదో ఇలా వర్ణిస్తాడు… ‘రీల్సెక్కువ చూడకెపుడు/ రీల్సెక్కువ సేయబోకు రీల్సును వదిలేరు’ అంటాడు. ‘Don’t reel some the reals./ Live real life. Do not watch the/Reels always and don’t waste/ your time in making them. It’s/ not beneficial for you’ అంటూ ఆంగ్లంలో దీనిని చెబుతాడు. ఇంకోచోట ‘ఫేస్బుక్కున మునగకెపుడు’ అంటూ హెచ్చరిస్తాడు. దీనిని Don’t be addicted to FB. Get familiar with good in FB. Grow with FB but don’t drown yourselg in it’ అని అనువదిస్తాడు. ఇంకోచోట ‘ఇన్‌స్టాలో ఫొటోలిడి/ ఇన్‌స్టా లో రీల్సుపెట్టి, యెన్నో ఫాలోస్?/ ఇన్‌స్టాలో లైక్సెన్నని?/ ఇన్ స్టా తోడను చెడకుర యెప్పుడు బాలా’ అంటూ తండ్లాడుతాడు. బాలల పట్ల ప్రేమ, జాతీయ భావన భాను ప్రకాష్‌కు రెండుకళ్ళు, అవధానం, విద్యాబోధన ఆత్మ. అది ఈ ట్రెండింగ్ పద్యాల్లో కనిపిస్తుంది. ‘పాశ్చాత్యపు పోకడలను/ పాశ్చాత్యపు శైలి వలదు భారతపౌరా!/ పాశ్చాత్యపు సంస్కృతియును/ పాశ్చాత్యపు మోజు విడుము భారత బాలా’ అంటూ చెబుతూనే, ‘సంస్కృతినే పాటించుము/ సంస్కృతి నీ యానవాలు సంస్కృతి విడకోయి/ సంస్కృతినే బతికించిన/ సంస్కృతి నిను బతుకజేయు చక్కగ బాలా’ అంటాడు. పిల్లల కోసం గేయాలను, పద్యాలను తన బాధ్యతగా అందించిన అవధాని అవుసుల భాను ప్రకాష్‌కు జయహో! జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548