లక్నో మెంటార్‌గా జహీర్‌ ఖాన్‌

Zaheer Khan as Lucknow mentors- భారత పేస్‌ వెటరన్‌ కొత్త ఇన్నింగ్స్‌
కోల్‌కత: భారత పేస్‌ బౌలింగ్‌ దిగ్గజం జహీర్‌ ఖాన్‌ 2025 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కొత్త ప్రాంఛైజీకి కొత్త బాధ్యతలతో మారనున్నాడు. ముంబయి ఇండియన్స్‌కు సహాయక సిబ్బందిగా కొనసాగిన జహీర్‌ ఖాన్‌.. రానున్న సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) మెంటార్‌ కమ్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా కోల్‌కతలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘లక్నో సూపర్‌జెయింట్స్‌ అతి తక్కువ సమయంలోనే రెండు సార్లు ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఈ జట్టుకు నేను బౌలింగ్‌ కోచ్‌గానూ కొనసాగుతాను. ఈ ప్రయాణం నాకు కొత్తగా ఉండనుంది. లక్నో సిటీలో ఎన్నో మ్యాచుల ఆడిన అనుభవం, ఇక్కడ గడిపిన అనుభూతులు ఉన్నాయి. వీలైనంత త్వరగా లక్నోకు చేరుకుని ఈ ప్రయాణం ప్రారంభిస్తాను’ అని జహీర్‌ ఖాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 45 ఏండ్ల పేస్‌ దిగ్గజం భారత్‌కు 92 టెస్టుల్లో, 200 వన్డేల్లో, 17 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. జహీర్‌ ఖాన్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు పడగొట్టాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌కు గతంలో ప్రస్తుత భారత జట్టు చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.