
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని మారుతి ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ.. పది సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్ మండలంలో తండాల్లో ఎక్కడ తాగునీటి సమస్య పరిష్కరించలేదని, ఇప్పటికీ చాలామంది పేదలు రేకుల షెడ్లు వేసుకుని బతుకుతున్నారని ఆయన విమర్శించారు. రూ.40 వేల కోట్లు తాగునీటి సమస్య పరిష్కారం కోసం కేటాయించామని చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ డబ్బులన్నీ ఎవరి జేబులకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న బిజినెస్ పాటిల్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, బీజేపీ అధిష్టానం డబ్బులకు టికెట్ అమ్ముకుందని, పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా డబ్బులకు టికెట్ అమ్ముతుందని ఆయన ఆరోపించారు. కార్యకర్తలు లేనిదే తను లేనని, సమిష్టిగా కష్టపడి జహీరాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తామని అలాగే నామినేట్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. 26 రోజులు ప్రతి కార్యకర్త పార్టీ కోసం పని చేయాలని, ఐదు సంవత్సరాలు పార్టీ కార్యకర్త సంక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.