మొన్న దావోస్ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.4వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. ఇప్పుడు మళ్లీ అమెరికా వెళ్లిన ఆయన మళ్లీ వేలకోట్ల పెట్టుబడుల వరద పారుతున్నట్టు పత్రికల్లో వార్తలు చదువుతుంటే అర్థమవుతుంది. అంతకు ముందు పదేండ్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో కల్వకుంట్ల తారక రామారావు విదేశాలకు వెళ్లినప్పుడల్లా వేలు… లక్షల కోట్ల పెట్టుబడులంటూ ఊదరగొట్టిన మాటలు ఇంకా చెవుల్లో ఠంగు మంటూనే ఉన్నాయి. ఈ సార్లు చెప్తున్న మాటలు వింటుంటే అమెరికా మొత్తం ఖాళీ అయ్యి, పారిశ్రామిక వేత్తలంతా తెలంగాణకు క్యూ కట్టారేమో అనిపిస్తుంది. అక్కడితో ఆగని పెద్దసార్లు… లక్షలాదిమంది నిరు ద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామనీ ఢంకా బజాయించి చెప్పబడ్తిరి. కానీ ఎమ్మెస్సీ చదివిన బిడ్డకు కొలువు రాలేదని నా కొలీగ్ చెప్తుండే. బీటెక్ సదివి ఆవారాగాని లెక్క కొడుకు తిరుగుతున్నడనీ పొరుగింటి పరం ధాములు మొత్తుకోబట్టే! అశోక్‌నగర్, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ కోచింగ్ సెంటర్లల్లో, హాస్టళ్లలో వేలాదిమంది నిరు ద్యోగులు కొలువుల కోసం ఆశగా ఎదురుచూడబట్టే! సర్కారు సార్లు సెప్పే గప్పాలకీ, మాక్కనబడే కొలువులు, కంపెనీలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ కనిపిస్తుండే! ఏం సార్లూ…జర కండ్లకు ఆ నల్లకండ్లద్దాలు తీసి సూడరాదుర్రీ!!
– ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి