చాలా కోటలు చూసా. కానీ సముద్రపు నీటి మధ్య ఉన్న కోటను ఎన్నడూ చూడలేదు. మీరు చూశారో లేదో నాకు తెలియదు. నేను చూసిన సముద్రపుకోటను మీకు పరిచయం చేద్దామని మీ ముందుకొచ్చా.
పదిమంది మిత్రులం మహారాష్ట్ర, రత్నగిరి జిల్లాలో కొంకణ్ తీరప్రాంతం వెళ్లాం. జుహగఢ్, మురుద్ పరిసర ప్రాంతాలు చూసి తిరిగి వస్తూ మార్గమధ్యంలో అద్భుతమైన కోటను చూశాం. అదే జంజీర్ ఫోర్ట్.
రాయగఢ్ జిల్లాలోని కొంకణ్ తీర ప్రాంత పట్టణం మురుద్. అక్కడికి దగ్గర్లోని రాజ్ పురి జెట్టీ గ్రామంలో జంజీర ఫోర్ట్ చూడడం కోసం టికెట్ (రు.50) తీసుకుని పడవ ఎక్కాం. కడలి తరంగాల మధ్య ఠీవిగా నిలబడ్డ జంజీర్ ఫోర్ట్ మమ్మల్ని ఆహ్వానిస్తూ…
గాలి దిశకు అనుగుణంగా తెరచాప మార్చుకునే నాటు పడవలో కుదిపే అలల మధ్య ప్రయాణం. మైలు దూరంని కోట సమీపంలోకి వచ్చినా కోట ద్వారం కనిపించలేదు. మరింత దగ్గరలోకి వచ్చిన తర్వాత కనిపించింది ప్రధాన ద్వారం.
దగ్గరికి చేరాం. కానీ అప్పుడే దిగడానికి మాకు అనుమతిలేదు. మాకంటే ముందే వెళ్లిన ఎనిమిది పడవలు ప్రయాణికులను దించడానికి వేచి ఉన్నాయి. కొన్ని పడవలు ప్రయాణికుల్ని దించి ఇవతలకు వచ్చి లంగరు వేసుకుని ఉంటుంటే కొన్ని పడవలేమో వచ్చిన వాళ్ళని దించి అంతకు ముందు వచ్చి చూసిన వాళ్ళని ఎక్కించు కుంటున్నాయి. ఆ పడవలన్నీ రాజ్ పురి జెట్టి నుండి వచ్చినవి కావు. కొన్ని మురుద్, మరో గ్రామంలో ఉన్న రేవు నుంచి పర్యాటకులను మోసుకొచ్చాయి.
మేం పడవ దిగి లోనికి వెళ్లాలంటే అరగంట పైన వేచి ఉండాల్సి వస్తుందని చెప్పారు సిబ్బంది.
తలపైన ఎండ మాడుస్తున్నది ఆ మిట్ట మధ్యాహ్నం వేళ. అరేబియా కడలి తరంగాలపై తేలియాడే నాటుపడవలో మేమూ మాతో పాటు మరి కొంతమంది అంటే దాదాపు ముప్పై మంది ఎప్పుడెప్పుడు పడవ దిగి, ఎన్నో ఆటుపోట్లు దాడులు దండయాత్రలకు సాక్షీభూతంగా నిలిచిన కోట లోకి ప్రవేశిద్దాం అని ఆత్రుతతో ఉన్నాం.
అలల తాకిడికి నాటు పడవ ఊగిపోతూ ఉండగా పడవ సిబ్బంది లోని వ్యక్తి కోట చరిత్ర, గొప్పతనాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. జజీరా అంటే అరబిక్ భాషలో ద్వీపం. అదే వాడుకలో జంజీర గా మారింది.
ఆఫ్రికన్ దేశమైన అబిస్సినియన్ సిద్దీ (ఇప్పటి ఇథియోపియా) 11వ శతాబ్దిలో వర్తక కూలీలుగా మనదేశంలో అడుగుపెట్టారు. అహ్మద్ నగర్ సుల్తానేట్ సైన్యంలో పని చేసారు.
మురుద్ కు చెందిన రాంరావు పాటిల్, కోలి లు 15 శతాబ్దిలో సముద్రపు దొంగల నుంచి దూరంగా ప్రశాంతంగా జీవించడానికి అహ్మద్‌నగర్ సుల్తానుల అనుమతితో చెక్క కోట నిర్మించారు. సిల్క్, మద్యం పెట్టెలు ఆ కోటలో దాచారు. తర్వాత వారు సుల్తానుల ఆదేశాలు పాటించలేదు. అప్పుడు అహ్మద్‌నగర్ సుల్తానేట్ నుంచి వచ్చిన సైన్యాధికారి సిద్ది పిరంఖాన్ మద్యంతో పార్టీ చేసుకుందామని చెప్పి కొన్ని మద్యం పెట్టెలలో తన సైనికులను దాచి కోట లోపలికి పంపించాడు. తాను కూడా లోపలికి ప్రవేశించి కోటను వారి నుంచి స్వాధీనం చేసుకున్నాడు.
ఆఫ్రికా నుంచి వచ్చిన సిద్ది లు జంజీరా ప్రాంతాన్ని 500 ఏళ్లు పాలించారు. స్వయంప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా ప్రకటించుకుని జంజీరా, జఫరాబాద్ పోర్ట్ కట్టారు. అతను చెబుతూ చాలాసార్లు హబిషి అన్నాడు. హబిషి అంటే అబిస్సినియన్ అని తర్వాత అర్ధమైంది.
జంజీర్ కోట విస్తీర్ణం 22 కిలోమీటర్లు. రాతి కోట కట్టడం పనులు 1569 లో మొదలు పెడితే అది పూర్తి కావడానికి 150 ఏళ్లు పట్టింది. సిద్ది మాలిక్ అంబర్ ప్రధానిగా ఉన్న కాలంలో గ్రానైట్ తో కోట నిర్మాణం చేపట్టారు. సిద్ధి సురల్ ఖాన్ హయాంలో నిర్మాణం పూర్తయింది. కోటలు చతురస్రాకారంలో ఉండడం చూస్తాం. కానీ ఇది శంఖాకారంలో ఉంది. హబిషి నవాబ్ కట్టించిన ఖిల్లాలోని దర్బారులో సమావేశాలు నిర్వహించేవారు
మరాఠా యోధుడు బాజీరావు పీష్వా జంజీర్ కోటను స్వాధీనం చేసుకోవాలని చాలా ప్రయత్నించి విఫలం అయ్యాడు. కాకపోతే సిద్ది లకు చెందిన జంజీర్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. 18వ శతాబ్దిలో మరాఠా పీష్వా బాజీరావు దాడి చేసినప్పుడు వందలాది సిద్దీలు మరణించారు. మరాఠాలు, సిద్దిల మధ్య తరచు దాడులు జరుగుతూ ఉండేవి. తర్వాత ఇరువర్గాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం జరిగింది. సిద్దిల శక్తి తగ్గిపోయింది.
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ కూడా కోటను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. శంభాజీ కోటలో సొరంగం వేయడానికి, కోటను స్వాధీనం చేసుకోవడానికి విఫలయత్నం చేశాడు. ఆ సొరంగ మార్గాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మూసేసారు.
మురుద్ సమీపంలో ఖాసా కోట అనే సముద్ర కోటను శంభాజీ. 22 ఎకరాల్లో 22 ఏళ్ల కాలవ్యవధిలో నిర్మించాడు.
మరాఠాలు, పోర్చుగీసు, బ్రిటిష్ వారు కోటలో పాగా వేయాలని ఎన్నో సార్లు దాడులు చేసారు, కానీ ఫలితం లేకపోయింది .
భారత దేశానికి స్వాతంత్రం వచ్చాక జంజీరా పోర్ట్ భారత భూభాగంలో భాగమైంది. జంజీర పోర్ట్ భారత ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్ళింది.
తర్వాతి కాలంలో రాజ్ పురి జెట్టి గ్రామం నుంచి కొంతమంది హిందువులు, ముస్లింలు వచ్చి ఆ ఖిల్లాలో నివాసం ఉన్నారు. అక్కడ నివాసానికి అన్ని వసతులు ఉన్నాయి కానీ వర్షాకాలంలో వచ్చే తుఫానులు, ఎగిసిపడే అలల మధ్య జీవనం కష్టం కావడంతో 1970లలో తిరిగి గ్రామంలోకి వెళ్లిపోయారు.
ఒక గైడ్ లాగా జంజీర్ గురించి చెప్పేది వింటూ మధ్య మధ్యలో ఫొటోలు తీస్తూ అరగంట పైనే గడిపాం. అదే రోజు రాత్రి 9.50 కి మా ట్రైన్. సమయం సరిపోతుందో లేదోనన్న ఆందోళన ఒక వైపు, మాడ్చే ఎండ మరో వైపు మాలో.
మాకంటే ముందున్న పడవల్లో వారిని దించడం చూస్తుంటే దిగగలమా అని సందేహం. కారణం ప్రధాన ద్వారం ముందున్న మెట్లు జారుడుగా కనిపిస్తున్నాయి. కొందరు పడిపోతున్నారు. సాధారణంగా పడవ అపి తాళ్లతో కట్టేస్తారు. అట్లా కట్టకుండా ఓ బక్కపలుచని వ్యక్తి తాడును లాగి పట్టుకున్నాడు. మరో వైపు పొడవాటి వెదురు కర్రను నీళ్ళలోకి పెట్టి గట్టిగా పట్టుకున్నారు. బహుశా అక్కడ రాతి మెట్లు ఉండి ఉంటాయి. అలల తాకిడికి పడవ ఊగుతుంటే మెట్లమీదకు దూకడం సర్కస్ ఫీట్ చేసినట్లు ఉంది. దిగేటప్పుడు పడిపోకుండా సిబ్బంది ఒక చేయి అందించడం కొంత ఊరట.
కోట ప్రధాన ద్వారం రాజపురి ఒడ్డు వైపు చూస్తూ ఉంది. సముద్రం వైపు మరో ద్వారం ఉన్నది. అది ఇప్పుడు మూసేసారు. సింహద్వారం నుండి ఎడమ చేతివైపు వెళ్ళగానే చిన్న టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ తీసుకుని కోట లోపలికి పోతే మసీదు, హిందూ దేవాలయం, నవాబు ప్యాలెస్, రాజదర్బార్, ధాన్యాగారం, నీటి బావులు, సమాధులు కనిపించాయి. కోట చుట్టూ సముద్రం ఉప్పు నీరు ఉన్నప్పటికీ కోట లోపలి బావిలో నీరు తీయగా ఉండడం విచిత్రం.
రాయల్ ప్యాలెస్, రాజదర్బార్ దూరం నుండే చూశాం. అన్నిటికన్నా ఎత్తులో రాజభవనం. అరేబియా సముద్రపు అందాలు, కోట దృశ్యాలు సంపూర్ణంగా చూపుతుంది. అక్కడి వరకు వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. అక్కడి నుండి సూర్యాస్తమయం చూడడం అద్భుతంగా ఉంటుందని పర్యాటకులు అనుకుంటుంటే విన్నప్పుడు కొంకణ్ తీరం లోని అంజన్ వేల్, హస్గోలి, దపోలి లలో అరేబియా సముద్రాన్ని రంగుల మయం చేసిన సూర్యాస్తమయ అద్భుత దశ్యాలు గుర్తొచ్చాయి. వీక్షించడానికి మాకు సమయమే లేదు.
ఒకటిన్నర గంటలో తిరిగి వస్తే ఇబ్బంది పడకుండా సమయానికి ముంబై చేరుకోగలం అని ముందే మా మినీ బస్ డ్రైవర్ చెప్పాడు. మేం ఫోర్ట్‌లో అడుగు పెట్టేటప్పటికి ఆ సమయం మించిపోయింది. నాటుపడవ దిగినప్పుడు అరగంట తర్వాత అందరూ సింహద్వారం దగ్గరకు రావాలని చెప్పడంతో హడావిడిగా చూసాం. కోట పైన నాలుగు అంతస్తుల్లో కనిపించే కట్టడాలు అన్ని చూసేందుకు పై వరకు వెళ్లే సాహసం చేయలేదు.
కోట గోడలు సుమారు 40 అడుగుల ఎత్తులో నిర్మించారు. వీటిపై దాదాపు 19 గుండ్రని బురుజులు ఉన్నాయి. వీటిలో మూడు చాలా పెద్ద ఫిరంగులు, కొన్ని చోట్ల మాములు సైజు ఫిరంగులు అమర్చి ఉన్నాయి. అంత బరువైన పెద్ద ఫిరంగులను అంత ఎత్తుపై అమర్చడం ఆషామాషీ వ్యవహారం కాదు. దేశంలో రెండవ అతిపెద్ద ఫిరంగి కాలాల్ బాంగిడి ఇక్కడ ఉంది.
తిరిగి వచ్చినప్పుడు ప్రధాన ద్వారం వద్ద రాతి గోడపై పులి ఏనుగుల్ని పట్టుకున్నట్టు ఉన్న శిల్పాలు కనిపిస్తాయి. ఆ శిల్పాల వెనుక కథ ఏమిటో!?
తాము సిద్దీ ఆదివాసీలమని చెప్పుకునే వారే నాటు పడవలు నడుపుతున్నారు. వారే నాటు పడవల సిబ్బంది. గేట్ దగ్గర ఉండే సిబ్బంది. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా, కింద పడిపోకుండా చూసుకునేది వాళ్ళు కాబట్టి తిరిగి ప్రయాణం అయినప్పుడు వారు తోచింది ఇవ్వమని అడిగినప్పుడు సంతోషంగా ఎంతో కొంత ఇస్తున్నారు. మోకాళ్ళ నెప్పులు, నడుమునొప్పి ఉన్న వాళ్ళకి నాటు పడవ ఎక్కడం, దిగడం ఇబ్బందే.
ఈ ద్వీపాన్ని వశం చేసుకోవాలని ఎందరో ప్రయత్నించారు. ఎన్నో దాడులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరని కోటను చూస్తూ తిరుగు ముఖం పట్టాం. ఎండ సమయం కాకుండా ఆహ్లాదకరమైన సమయంలో వెళ్తే మరింత ఎంజారు చేస్తాం. లోపల ఏమీ దొరకవు కాబట్టి వెంట తీసుకుపోవడం మంచిది. ముఖ్యంగా మంచినీళ్లు.
శతాబ్దాలుగా సముద్రం మధ్యలో అలల పోటులో ఉన్నప్పటికీ చెదరని కోట సౌందర్యం అబ్బుర పరుస్తుంది. సముద్రంలో కోట కట్టడమే ఓ సాహసం అయితే రాళ్ల మధ్య పాదరసం, సీసం, బెల్లం మిశ్రమాన్ని వినియోగించడం, ఆ గోడలు ఎక్కడ బీటలు రాకపోవడం విశేషం. అలల ఆటుపోట్లకు నల్ల గ్రానైట్ రాళ్లు కొద్దిగా అరిగి కనిపిస్తాయి కానీ వాటి మధ్య ఉన్న సున్నం, పాదరసం, సీసం, బెల్లపు మిశ్రమం మాత్రం చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యమే. సముద్రపు గాలిలో ఉన్నప్పటికీ ఫిరంగులు తమ రూపు రేఖలు కోల్పోకపోవడం ఆశ్చర్యమే. అయితే కోటలోని కట్టడాలు మాత్రం చెదిరిపోయాయి. గత కొన్ని దశాబ్దాలుగా నిర్వహణ లోపం వల్ల పాడుపడి పోయినట్లు తోచింది.
ఏదేమైనా ఇదొక అద్భుతమైన ఇంజినీరింగ్ కట్టడం అని చెప్పక తప్పదు. ఆనాటి సాంకేతిక, ఇంజనీరింగ్ నైపుణ్యాలు ప్రతిబింబించే ఇటువంటి కట్టడాలు పదికాలాల పాటు పదిలపరచాల్సిన బాధ్యత, భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన ప్రభుత్వానిది, పురవాస్తుశాఖవారిది.
అరేబియా సముద్రపు ఉప్పు నీటిలో నిలిచిన ఇంజనీరింగ్ అద్భుతం జంజీర్ పోర్ట్.
– వి. శాంతి ప్రబోధ, 9866703223