– ఉపకారవేతన పెంపు లేక ఎనిమిదేండ్లు
– చాలకపోవటంతో హౌమియో వైద్యవిద్యార్థుల ఇబ్బందులు
– ఇక సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామంటున్న పీజీలు, హౌస్ సర్జన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘దేశ వైద్యారోగ్య రంగంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. చాలా కొలమానాల్లో నిటిఅయోగ్ ర్యాంకుల్లో మొదటి స్థానాన్నికైవసం చేసుకుంది. కేరళ, తమిళనాడు తర్వాత పలు విషయాల్లో మనమే అగ్రగామి. అయితే ఈ మూడో స్థానంతో సరిపెట్టుకోవద్దు. మొదటి స్థానంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి….’ ఇది వైద్యారోగ్యశాఖ మంత్రి దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి పదే పదే చెప్పే మాటలివి. తెలంగాణ వైద్యరంగంలో దేశంలోనే మూడో స్థానంలోకి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలతో పాటు వైద్య, నర్సింగ్ సిబ్బంది చేసిన కృషి కూడా కారణం. కానీ అదే సిబ్బంది తమకున్న అనేక సమస్యలను ఉన్నతాధికారుల నుంచి ప్రజా ప్రతినిధులు, మంత్రుల వరకూ ఏకరవు పెడుతున్నా పరిష్కారానికి నోచుకోకపోవడం గమనార్హం.
వైద్యవిద్యార్థులకు ప్రతి రెండేండ్లకు ఒకసారి 15 శాతం చొప్పున ఉపకారవేతనాలు పెంచాలనే ఉత్తర్వులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి అమల్లో ఉన్నాయి. అవి అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా ఆయుష్ విద్యార్థులకు కూడా వర్తిస్తాయి. హైదరాబాద్ రామాంతపూర్‌లోని హౌమియో వైద్య కళాశాలలో చదువుకుంటూ సేవలందిస్తున్న పీజీలు, హౌస్ సర్జన్లకు చివరిసారిగా 2014లో (తెలంగాణ ఏర్పడక ముందు) 15 శాతం ఉపకార వేతనం పెంపును అమలు చేశారు. ఆ పెంపుతో హౌస్ సర్జన్లకు నెలకు రూ.10,500, పోస్ట్ గ్రాడ్యుయేట్లు మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.23,800, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.25,128, మూడో ఏడాది విద్యార్థులకు రూ.26,450 ఇస్తున్నారు. గత ఎనిమిదేండ్లతో పెంపుదల జీవోను అమలు చేయకపోవడంతో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయాన్ని తట్టుకుంటూ వారు వీటితోనే నెట్టుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పీజీలుకు వరసగా రూ.35,589, రూ.37,566, రూ.39,543 ఇస్తుండగా, దేశంలో మొదటి స్థానంలో ఉన్న కేరళలో పీజీలకు వరసగా రూ.42,560, రూ.45,600, రూ.48,640 ఇస్తున్నారు. ప్రస్తుతం హౌమియో వైద్యకళాశాలలో 109 మంది పీజీలు ఉండగా, వంద మంది వరకు హౌజ్ సర్జన్ సేవలందిస్తున్నారు.
ముగ్గురు మంత్రులకు వినతులు
తమకు ఉపకారవేతనాలను పెంచాలని పీజీలు, హౌజ్ సర్జన్లు గతంలో వైద్యారోగ్యశాఖ మంత్రులుగా పని చేసిన డాక్టర్ సిహెచ్.లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ తో పాటు ప్రస్తుత వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును సైతం కలిసి విన్నవించుకున్నారు. గతంలో పని చేసిన ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయడమే కాకుండా 2018 ఎన్నికల ముందు కూడా కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఏడాది జరిగే కళాశాల వార్షికోత్సవానికి వచ్చే స్థానిక ఎమ్మెల్యేతో పాటు ముఖ్యనేతల ముందు కూడా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. నేతలు కలవడం, హామీలివ్వడం వరకే పరిమితం కాగా అవి అమలుకు మాత్రం నోచుకోవటం లేదు. దీంతో విద్యార్థులు ఈ సారి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నాలుగు రోజులుగా ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నాలతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వారం రోజుల్లో అమలు చేయాలి
ఉపకారవేతనాల పెంపు జీవోను వారం రోజుల్లో అమలు చేయాలని హౌమియో వైద్య విద్యార్థులు ప్రభుత్వానికి హెచ్చరించారు. లేకపోతే విధులు బహిష్కరిస్తామని విద్యార్థి నాయకులు డాక్టర్ సంతోష్, డాక్టర్ శివరాజు, డాక్టర్ వినరు, డాక్టర్ అశీష్, డాక్టర్ షణ్ముఖ్, డాక్టర్ రతన్ హెచ్చరించారు. 2014తో పోలిస్తే నిత్యావసర వస్తువులు, వసతి సౌకర్యాలు, ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు పెరిగిపోయాయనీ, పాత ఉపకారవేతనాలు ఏ మాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు.