ఫైనల్లో జెంగ్‌, సబలెంక

– సెమీస్‌లో గాఫ్‌ పరాజయం
– ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరుకు చైనా స్టార్‌ క్వివెన్‌ జెంగ్‌, రెండో సీడ్‌ అరినా సబలెంక (బెలారస్‌) చేరుకున్నారు. గురువారం జరిగిన సెమీఫైనల్లో అమెరికా యువ సంచలనం, నాల్గో సీడ్‌ కొకొ గాఫ్‌కు పరాజయం ఎదురైంది. టైటిల్‌ ఫేవరేట్ల సమరంలో సబలెంక 7-6(7-2), 6-4తో వరుస సెట్లలో విజయం సాధించింది. గాఫ్‌ ఐదు ఏస్‌లు సంధించగా, సబలెంక నాలుగు ఏస్‌లు కొట్టింది. గాఫ్‌ మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించగా, సబలెంక నాలుగు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా 82-68తో పైచేయి సాధించింది. టైబ్రేకర్‌కు దారితీసిన తొలి సెట్‌లో పైచేయి సాధించిన సబలెంక రెండో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించింది. మరో సెమీస్‌లో 12వ సీడ్‌ చైనా స్టార్‌ జెంగ్‌ 6-4, 6-4తో వరుస సెట్లలో గెలుపొందింది. నాలుగు ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో క్విన్‌వెన్‌ అదరగొట్టింది. శనివారం జరిగే టైటిల్‌ పోరులో సబలెంకతో జెంగ్‌ ఢకొీట్టనుంది. ఫైనల్లో బోపన్న జోడి :భారత స్టార్‌ రోహన్‌ బోపన్న జోడి పురుషుల డబుల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. మాథ్యూ ఎబ్డెన్‌ జతగా బోపన్న 6-3, 3-6, 7-6(10-7)తో మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించి టైటిల్‌ పోరుకు చేరుకున్నారు.