– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ యువత భవిత కోసం రాష్ట్రంలో జిల్లాకో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ ఏర్పాటు చేయబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీఎస్) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో ”స్వచ్ఛత హి సేవా” కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి నైపుణ్యాలను యువతలో పెంపొందించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే అగ్రగామిగా తెలంగాణాను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణా నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతను తయారు చేసేందుకు ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మారుస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుందని అన్నారు. గత పదేండ్లలో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవలం 1.5 లక్షల మంది మాత్రమే శిక్షణ పొందగా, ఈ ఏటీసీలతో రానున్న పదేండ్లలో 4 లక్షల మంది శిక్షణ పొందేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.