పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జెడ్పీ ఛైర్మన్ డీ. విఠల్ రావు

నవతెలంగాణ – మాక్లూర్
ప్రతి ఒక్కరూ గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా జెడ్పీ చైర్మన్ డీ.విఠల్ రావు తెలిపారు. ఆదివారం మండలంలోని మాందాపుర్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డ్రైనేజీలలో మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, త్రాగు నీరు కలుషితం కాకుండా ట్యాంక్ లను శుభ్రపరుచుకోవాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు సైతం తమ ఇంటిచుట్టూ శుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. అనంతరం మండలంలోని ముల్లంగి, బొంకన్ పల్లి గ్రామాల లిఫ్ట్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కిరణ్ దేశ్ పాండే, ఎంపీడీఓ క్రాంతి, మాజీ సర్పంచ్ సులోచన, ప్రజా ప్రతినిధులు, నాయకులు, పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.