పోలియో రహిత సమాజం కోసం చుక్కలు వేయించాలి: జెడ్పీటీసీ, ఎంపీపీ

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
పోలియో రహిత సమాజం కోసం పోలియో చుక్కలు ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పకుండా వేయించాలని స్థానిక జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి సూచించారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 5 ఏండ్ల లోపు చిన్నారులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రేవంత్, సంఘమిత్రల ఆధ్వర్యంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ, ఎంపీపీ హాజరై, లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఆళ్ళపల్లి మండలంలో 1713 మందికి పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా ఆదివారం 1672 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని చెప్పారు. మొత్తంగా 97% శాతం పోలియో చుక్కలు వేయడం పూర్తయినట్లు తెలిపారు. మండలంలో మిగిలిన ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.