జ్వెరెవ్‌ ఔట్‌

Zverev is out– టేలర్‌ ఫ్రిట్జ్‌ చేతిలో ఓటమి
– యు.ఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
న్యూయార్క్‌ (అమెరికా) : యు.ఎస్‌ ఓపెన్‌లో మరో స్టార్‌ ఆటగాడికి షాక్‌ తగిలింది. మెన్స్‌ సింగిల్స్‌లో నాల్గో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) క్వార్టర్‌ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. వరల్డ్‌ నం.12 టేలర్‌ ఫ్రిట్జ్‌ 7-6(7-2), 6-4, 7-6(7-3)తో వరల్డ్‌ నం.4 జర్మనీ స్టార్‌ను చిత్తు చేశాడు. మూడున్నర గంటల పాటు సాగిన క్వార్టర్స్‌ పోరులో టేలర్‌ 12 ఏస్‌లు కొట్టగా.. జ్వెరెవ్‌ 14 ఏస్‌లు సంధించాడు. టేలర్‌, జ్వెరెవ్‌ చెరో రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించారు. కానీ కీలక రెండు టైబ్రేకర్‌లను నెగ్గిన టేలర్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. జ్వెరెవ్‌ 52 విన్నర్లతో మెరిసినా.. పాయింట్ల పరంగా 139-134తో టేలర్‌ పైచేయి సాధించాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో గ్రిగర్‌ దిమిత్రోవ్‌ గాయంతో పోటీ నుంచి తప్పుకున్నాడు. 3-6, 7-6(7-5), 3-6, 1-4తో వెనుకంజలో నిలిచిన సమయంలో దిమిత్రోవ్‌ ఫిట్‌నెస్‌ సమస్యతో వాకోవర్‌ ఇచ్చాడు. దీంతో ఫ్రాన్సెస్‌ (అమెరికా) సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగే తొలి సెమీస్‌లో అమెరికా ఆటగాళ్లు టేలర్‌, ఫ్రాన్సెస్‌ ఢకొీట్టనున్నారు.
మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్‌ ఎమ్మా నవారో సెమీస్‌కు చేరుకుంది. 6-2, 7-5తో వరుస సెట్లలో పౌలా బడోసా (స్పెయిన్‌)పై ఎమ్మా విజయం సాధించింది. చైనా అమ్మాయి జెంగ్‌పై 6-1, 6-2తో గెలుపొంది సబలెంక సైతం సెమీఫైనల్లో కాలుమోపింది.