అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు

ముంబయి: అదాని కంపెనీలకు రూ.27వేల కోట్ల అప్పులు ఇచ్చినట్లు దేశంలోనే అతిపెద్ద రుణదాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వెల్లడించింది. ఇది అదాని మొత్తం రుణ పుస్తకంలో 0.88 శాతానికి సమానమని ఎస్‌బీఐ చైర్మెన్‌ దినేష్‌ ఖార తెలిపారు. ”పోర్టుల నుంచి గనుల రంగాల్లో వ్యాపారాలు కలిగిన అదానీ గ్రూపు షేర్లను తనఖాగా పెట్టుకుని రుణాలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఆ కంపెనీల రుణాల చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. స్పష్టమైన ఆస్తులు, తగిన నగదు ప్రవాహాల ఆధారంగానే అప్పులిచ్చాం. అద్బుతమైన రీపేమెంట్‌ రికార్డును కలిగి ఉంది. అదానీ గ్రూపు నుంచి ఎలాంటి రుణాల పునరుద్ధరణ ప్రతిపాదన రాలేదు.” అని దినేష్‌ ఖార పేర్కొన్నారు.
రూ.10 లక్షల కోట్ల నష్టం
అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్న అదానీ పవర్‌తో చేసుకున్న ఒప్పందంపై సవరణలు కోరుతామని బంగ్లాదేశ్‌ ప్రభుత్వ వర్గాలు చేసిన ప్రకటనతో ఆ కంపెనీ సూచీ 5 శాతం పడిపోయి రూ.192 వద్ద ముగిసింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌నకు తోడు అంతర్జాతీయ విత్త సంస్థలు అదానీ గ్రూపునపై ఆంక్షలకు దిగడంతో ఆ కంపెనీల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ఓ దశలో మరో 35 శాతం పతనమై రూ.1,017 కనిష్ట స్థాయిని తాకి.. అనంతరం కొనుగోళ్ల మద్దతుతో తుదకు 1.25 శాతం పెరిగి రూ.1,584 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 10 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 10 శాతం, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం, అదానీ విల్మర్‌ 5 శాతం, ఎన్‌డీటీవీ 5 శాతం చొప్పున పతనమయ్యాయి. గడిచిన ఏడు సెషన్లలో అదానీ స్టాక్స్‌ రూ.10 లక్షల కోట్ల విలువను కోల్పోయారు. 10 స్టాక్స్‌ కూడా 51 శాతం మేర పతనం కావడంతో వాటి క్యాపిటలైజేషన్‌ రూ.9.31 లక్షల కోట్లు హరించుకుపోయింది.
21వ స్థానానికి అదానీ పతనం..
హిండెన్‌బర్గ్‌ దెబ్బకు ప్రపంచ కుబేరుల్లో గౌతం అదానీ టాప్‌-20 జాబితా నుంచి బయటికి నెట్టబడ్డారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న అదాని.. గడిచిన వారం రోజుల్లో పాతాళానికి పడిపోయారు. తాజాగా 61.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 21వ స్థానానికి దిగజారరని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ తెలిపింది. కాగా 57.6 బిలియన్‌ డాలర్ల సంపదతో అదాని 22వ స్థానానికి పడిపోయారని ఫోర్బ్స్‌ లిస్ట్‌ వెల్లడించింది.