అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తెలంగాణ

– బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది కానీ ఏపీలో మాత్రం అభివృద్ధి కుంటి పడిందని బీఆర్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ అన్నారు. తెలంగాణ నేటివిటీ ఎంప్లాయిస్‌ వర్కింగ్‌ ఇన్‌ సీమాంధ్ర (టీఎన్‌ఈడబ్ల్యూఎస్‌ఏ) నాన్‌ లోకల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఎల్‌టీఏ) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్ర, తెలంగాణ ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలపై ఉమ్మడి సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తోట చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ మీ సమస్యలను సీఎం కేసీఆర్‌ దష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. వెంటనే వారు స్పందిం చి సమస్యలకు పరిస్కారం చూపుతామని హామీ ఇచ్చారని వివరించారు. సీఎం కేసీఆర్‌ మహౌన్నత వ్యక్తి అని.. ఆయన ద్వారా తెలంగాణ రాష్ట్రం ఇంతగా అభివద్ధి చెందిందన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణలో అద్భుతాలు జరిగాయని, వలసలు ఆగిపోయాయని బీడు భూములు నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు ఒకే సమయంలో విడిపోయినా ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివద్ధిలో దూసుకుపోతున్న దన్నారు. ఏపీ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని ,కనీసం ఉద్యోగులకు వేతనాలు సరైన సమయంలో రావడం లేదన్నారు. ఉద్యోగుల పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో చెప్పక్కర్లేదన్నారు. తెలంగాణలో మూడున్నరేండ్లలో కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని కోటి ఎకరాలకు నీరు అందిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ పోలవరం ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. మంచి పాలనను అందించే పార్టీలనే ఎన్నుకోవాలన్నారు. టీఎన్‌ఎస్‌డబ్ల్యూఈఎస్‌ఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు బాబు రావుల కిషోర్‌ బాబు, రమేష్‌ నాయుడు, ప్రధాన కార్యదర్శి బి అంజయ్య, నాన్‌ లోకల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ మోహన్‌ రావు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, డాక్టర్‌ శ్రీనివాస్‌, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.