అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్య కేసులో.. మరో ఇద్దరు అరెస్ట్‌

–  నిందితుడు స్నేహితుడు, స్నేహితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
–  తెలిసి నేరం దాచినా హంతకులే అవుతారు: డీసీపీ
నవతెలంగాణ-హయత్‌నగర్‌
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లా పూర్‌ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నవీన్‌ అనే యువకుడిని అతని స్నేహితుడు హరి హర కృష్ణ గత నెల 17న దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హరిహరను పోలీస్‌ కస్టడికి తీసుకుని విచారిస్తున్నామని ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. సోమవారం ఎల్‌బీనగర్‌ ఉన్న ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమన్నారు. హరిహరా స్నేహితురాలు నిహారికతో పాటు స్నేహితుడు హాసన్‌ను కూడా అరెస్ట్‌ చేశామని తెలిపారు. వారికి హత్య గురించి తెలిసినా కూడా పోలీసులకు చెప్పలేదని.. దాంతో ఇద్దరినీ కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. హత్య జరిగిన తర్వాత నిహారిక రూ. 1500 హరిహరకు ట్రాన్స్‌ఫర్‌ చేసిందని తెలిపారు. అలాగే నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, హాసన్‌, నిహారిక ముగ్గురు వెళ్లారన్నారు. నిహారిక ఫోన్‌లోని డేటాను కూడా డిలీట్‌ చేసిందని చెప్పారు. నేరాన్ని చేసినా, చూసి దాచినా నేరమే అని, సమాజంలో నేరాన్ని ఎవరు ప్రోత్సహించినా చట్టవ్యతిరేకమైన చర్య తీసుకుంటామని డీసీపీ తెలిపారు. తాము హరి హర కృష్ణను తీసుకున్న కస్టడీ 9వ తేదీన ముగుస్తుందని తెలిపారు. ఆమె వెంట ఎల్‌బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్‌ రెడ్డి, అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వామి ఉన్నారు.