‘ఔట్‌ సోర్సింగ్‌’ రద్దు చేయాలి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

–  వీఆర్‌ఏల కోసం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించొద్దు : జేఏసీ ఆత్మీయ సమ్మేళనంలో నేతల విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఏజెన్సీల అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయనీ, సకాలంలో జీతాలు ఇవ్వకపోగా, అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. కర్మన్‌ఘాట్‌లోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేఏసీ నేతలు పులి లక్ష్మయ్య, కె.సంతోష్‌, వినోద్‌, అరుణ్‌కుమార్‌, నారాయణ, బిందు తదితరులు మాట్లాడారు. మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించి రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పే-స్కేలు, ఇతర ప్రయోజనాలు వర్తింపజేయాలనీ, మూడేండ్ల సర్వీసు పూర్తి కాని ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందజేయాలనీ, కారుణ్య నియామకం కింద కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 2023 ఏప్రిల్‌ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలన్నారు. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ ప్రభావం పశుసంవర్థక శాఖలో 15 ఏండ్లుగా పనిచేస్తున్న వందల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులపై పడిందనీ, పెద్ద సంఖ్యలో వీఆర్‌ఏలను తమ శాఖకు కేటాయించారన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఇకపై విధులకు రావాల్సిన అవసరం లేదని నాలుగైదు జిల్లాల్లో పశుసంవర్థక శాఖ ఆఫీస్‌ సబార్డినేట్లకు స్థానిక అధికారులు తేల్చి చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు ప్రసాద్‌, కష్ణ, గోవర్ధన్‌, జహీరుద్దీన్‌, శ్రీధర్‌, జగదీష్‌, శ్రీనాథ్‌గౌడ్‌, విజయలక్ష్మీ, సునీత, రాజిరెడ్డి, సురేందర్‌, సంధ్య, యాదయ్య, నాజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love