అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనివ్వరా..

– మొన్న సెక్రటేరియట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు
– ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ.పాల్‌ ధ్వజం
నవతెలంగాణ-సిటీబ్యూరో
కనీసం అమరవీరుల స్థూపం వద్దకు కూడా వెళ్లనివ్వరా?.. మొన్న సెక్రటేరియట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు.. ఇదేం గూండాయిజం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ.పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కెఏ.పాల్‌ నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు పాల్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజున ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం తన వ్యక్తిగత ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభం నిలిపేయాలని తాను హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్టు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జన్మించిన ఏప్రిల్‌ 14న కాకుండా ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా సెక్రటేరియట్‌ను ప్రారంభించడం సరికాదన్నారు. దేవుడు కూడా వద్దనుకున్నాడు అందుకే సచివాలయం కాలిపోయిందన్నారు. వాస్తు బాగాలేదని సచివాలయాన్ని కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారన్నారు. అవినీతి ఎంతోకాలం చెల్లదని, కేసీఆర్‌ ఇప్పటికైనా పశ్చాత్తాపడాలన్నారు. కేసీఆర్‌ ఈసారి గెలవలేడని.. ఇక ప్రధాని ఏం అవుతాడని ప్రశ్నించారు. అంబేద్కర్‌ జయంతి రోజే సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.