ఇంట్లో అరటికాయలు ఉంటే వేపుడు చేసేద్దాం… లేదా బజ్జీలు చేసుకుందాం అనుకుంటారు చాలా మంది. ఇవి తప్ప మరోరకంగా వండాలనే ఆలోచన పెద్దగా రాదు. కానీ అరటికాయలతో రకరకాల కూరలు నోరూరించేలా చేసుకోవచ్చు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం…
పిండి మిరియం
కావల్సిన పదార్థాలు:
అరటికాయ – ఒకటి, కందిపప్పు – కప్పు, కారం – అరచెంచా, దనియాలు – చెంచా, సెనగపప్పు – చెంచా, బియ్యం – అరచెంచా, మిరియాలు – ముప్పావు చెంచా, కొబ్బరి తురుము – రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి – నాలుగు, ఇంగువ – చిటికెడు, నూనె – పావుకప్పు, చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత.
తయారు చేసే విధానం: కందిపప్పును కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని తీసుకోవాలి. అదే విధంగా అరటికాయను కూడా ఓసారి కడిగి, చెక్కుతీసి ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి ధనియాలు, సెనగపప్పు, బియ్యం, మిరియాలు, మూడు ఎండుమిర్చి, చింతపండు వేసి వేయించి చివరగా కొబ్బరి తురుము కూడా వేసి స్టౌని కట్టేయాలి. ఈ తాలింపు వేడి చల్లారాక మిక్సీలో తీసుకుని కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టౌమీద ఎండుమిర్చి వేయించి ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు, కందిపప్పు, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి అరకప్పు నీళ్లు పోయాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు ముందుగా చేసుకున్న మసాలా వేసి మరోసారి కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.
మసాలా వేపుడు
కావల్సిన పదార్థాలు: అరటికాయలు – రెండు, పసుపు – అరచెంచా, నూనె – పావుకప్పు, కరివేపాకు రెబ్బలు – రెండు, ఉప్పు – తగినంత, ఉల్లిగడ్డ – ఒకటి.
మసాలాకోసం: కొబ్బరి తురుము – పావుకప్పు, ధనియాలు – రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాలు – ఒకటిన్నర చెంచా, జీలకర్ర – చెంచా, ఎండుమిర్చి – నాలుగు, వెల్లుల్లి రెబ్బలు – నాలుగు.
తయారు చేసే విధానం: అరటికాయల చెక్కు తీసి ముక్కల్లా కోసి నీళ్లల్లో వేసుకోవాలి. మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేయించి ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. అవి కూడా వేగాయనుకున్నాక అరటికాయ ముక్కల్ని వేసి బాగా కలిపి పావుకప్పు నీళ్లు, ముందుగా చేసుకున్న మసాలా, తగినంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. అరటికాయముక్కలు ఉడికి నీళ్లన్నీ ఆవిరైపోయాక మిగిలిన నూనె వేసి బాగా వేయించుకుని తీసుకోవాలి.
వడ
కావల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు – కప్పు, సెనగపప్పు – అరకప్పు, ఉల్లిగడ్డ – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, అల్లం తరుగు – అరచెంచా, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌స్పూన్లు.
తయారు చేసే విధానం: సెనగపప్పును నాలుగు గంటల ముందు నానబెట్టుకుని ఆ నీటిని వంపేసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న వడల్లా చేసుకుని కాగుతున్న వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
కోఫ్తా కర్రీ
కావల్సిన పదార్థాలు: అరటికాయలు – రెండు, పనీర్ తురుము – అరకప్పు, ఉల్లిగడ్డ – ఒకటి, సెనగపిండి – టేబుల్‌స్పూను, అల్లం – పచ్చిమిర్చి ముద్ద – చెంచా, దనియాల పొడి – అరచెంచా, కొత్తిమీర – కట్ట, నూనె వేయించేందుకు సరిపడా.
గ్రేవికోసం: దాల్చినచెక్క – ఒకటి, యాలకులు – రెండు, ఉల్లిగడ్డ – ఒకటి, టమాటా – ఒకటి, పసుపు – పావుచెంచా, కారం – చెంచా, దనియాల పొడి – అరచెంచా, జీలకర్ర పొడి – చెంచా, గరంమసాలా – పావుచెంచా, జీడిపప్పు – పది(పావుగంట పాటు నానబెట్టుకుని తర్వాత మెత్తగా గ్రౌండ్ చేసుకోవాలి) క్రీమ్ – రెంచు చెంచాలు, ఉప్పు – తగినంత. తయారు చేసే విధానం: అరటికాయల్ని ఉడికించుకుని చెక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు, పనీర్ తురుము, అల్లం పచ్చిమిర్చి ముద్ద, దనియాల పొడి, కొత్తిమీర, సెనగపిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు బాణలిని మళ్లీ స్టౌమీద పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి దాల్చిన చెక్క, యాలకులు వేయించి ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. అవి వేగాక పసుపు, జీలకర్ర పొడి, దనియాల పొడి, కారం, తగినంత ఉప్పు, టమాటా ముద్ద వేయాలి. అది కూడా ఉడికాక జీడిపప్పు ముద్ద వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. అన్నీ ఉడికి దగ్గరకు అవుతున్నప్పుడు ముందుగా చేసుకున్న ఉండలు, క్రీమ్ వేసి బాగా కలిపి దింపేయాలి.