ఆపేసిన ప్లేడేలు ఇవ్వాలి

– నల్ల బ్యాడ్జీలతో సింగరేణి కార్మికుల నిరసన
నవతెలంగాణ – గోదావరిఖని
కరోన నేపథ్యంలో సింగరేణిలో ఆఫ్‌ చేసిన ప్లేడేలను తిరిగి ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఆర్‌జీ-1 ఏరియా వర్క్‌షాప్‌ కార్మికులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్‌జీ-1లో ఉత్పత్తి, ఉత్పాదకతలో 2022-23 సంవత్సరం లక్ష్యాన్ని నెల కంటే ముందుగానే సాధించినందుకు తాము గర్విస్తున్నామని చెప్పారు. ఏరియా వర్క్‌షాప్‌ కార్మికులమైన తాము ఉత్పత్తి, ఉత్పాదకతలో భాగస్వాములమయ్యామని తెలిపారు. అయితే, ఓసీపీ-5 టార్గెట్‌ రాగానే ప్లేడేలు తిరిగి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయారు. ఏరియా వర్క్‌షాప్‌లో ఆఫ్‌ చేసిన ప్లేడేలను పునరుద్ధరించాలని కోరారు. అనంతరం వర్క్‌షాప్‌ అధికారికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్‌టీయూసీ డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ దేవులపల్లి రాజేందర్‌, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసి, హెచ్‌ఎంఎస్‌ సంఘాల నాయకులు పాల్గొన్నారు.