ఆరె కులస్తులను ఓబీసీలో చేర్చాలి

– ఆరెకుల సంక్షేమ సంఘం చైర్మెన్‌ కిషన్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ చైర్మెన్‌ లింగంపల్లి కిషన్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘంలో వివిధ రాజకీయ పార్టీల వారుంటారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ, ప్రభుత్వం మంచి చేసినా ఆ విషయాలను అందరికీ చెప్పాల్సిన అవసరముందన్నారు. సంఘం ప్రతిష్టకు భంగం కలిగేలా అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదని అన్నారు. ఆరెకుల సంఘానికి రూ.50 కోట్ల విలువ చేసే ఎకరం స్థలం, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు ప్రకటించారు. ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మెన్‌గా లింగంపల్లి కిషన్‌రావు తిరిగి ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా రెకెంధర్‌ చలపతిరావు, ప్రధాన కార్యదర్శిగా వరికెల శ్రీనివాస్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షులుగా ఏసికా శంకర్‌రావు, ఉపాధ్యక్షులుగా కృష్ణాజి, బాసోపోలు శ్రీనివాస్‌, జెండా అంబయ్య, కర్రోల్ల సత్యం, కంటెడి రామోజీ, రాష్ట్ర కార్యదర్శులుగా దాపాడి బాలాజీ రావు, నిట్టె బాలరాజును ఎన్నుకున్నారు.