ఆర్టీసీలో మళ్లీ జీతాల కోసం ఎదురుచూపులు

– బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించాలి :
టీజేఎమ్‌యూ ప్రధాన కార్యదర్శి కే హన్మంతు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీ వేతనాలు ఇస్తున్నామని మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ చాలాసార్లు చెప్పారనీ, కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చిందని తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎమ్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్‌ విమర్శించారు. ఉద్యోగులు మళ్లీ వేతనాల గురించి ఎదురు చూసే పరిస్థితి రావడం చాలా హేయమైనదనీ, ఇప్పటికే చాలీచాలని వేతనాలతో డ్యూటీలు చేస్తూ కార్మికులు కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్‌, డ్రైవర్లకు వేతనాలు ఇచ్చి, మిగతా మెయింటెనెన్స్‌ సిబ్బంది, సూపర్‌వైజర్లు, ఆఫీసు సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికే సంస్థలో రెండు వేతన సవరణలు మొదలు కార్మికులకు అనేక బకాయిలు రావల్సి ఉన్నాయన్నారు. చట్ట వ్యతిరేక డ్యూటీలను వేస్తూ ఆర్టీసీ సిబ్బందిని నానా రకాలుగా వేధిస్తూ, జీతాలు కూడా సమయానికి ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.6వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. గత బడ్జెట్‌లో పెట్టిన రూ. 1,500 వందల కోట్లలో కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చారనీ, ఫలితంగా ఆర్టీసీ పరిస్థితి ఆర్థికంగా దిగజారుతున్నదని చెప్పారు.