ఆసీస్‌ లక్ష్యం 76

–  స్పిన్‌ త్రయంపైనే భారత్‌ ఆశలు
–  భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 163/10
–  ఆదుకున్న చతేశ్వర్‌ పుజార, అయ్యర్‌
–  భారత్‌, ఆసీస్‌ మూడో టెస్టు రెండో రోజు
టీమ్‌ ఇండియా మళ్లీ స్పిన్‌ ఉచ్చులో పడింది. హోల్కర్‌ పిచ్‌పై నాథన్‌ లయాన్‌ (8/64) మాయజాలం ముందు రోహిత్‌సేన తేలిపోయింది. చతేశ్వర్‌ పుజార (59) అర్థ సెంచరీతో ఆదుకున్నప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 163 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌ లోటు 88 పరుగులను భర్తీ చేసి.. ఆసీస్‌కు 76 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప ఛేదనలో స్పిన్‌ త్రయం అశ్విన్‌, జడేజా, అక్షర్‌లపైనే భారత్‌ ఆశలు పెట్టుకుంది.
నవతెలంగాణ-ఇండోర్‌
మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ చేసిన కంగారూలు.. ఇండోర్‌లో విజయంపై కన్నేశారు!. నాథన్‌ లయాన్‌ (8/64) ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో 1-2తో బోణీ కొట్టేందుకు ఆసీస్‌ ఉవ్విళ్లూరుతుంది. చతేశ్వర్‌ పుజార (59, 142 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీకి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (26, 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దీటైన ఇన్నింగ్స్‌తో భారత్‌ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు. రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే భారత్‌ కుప్పకూలింది. అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసింది. 186/5తో ఉన్న ఆసీస్‌ను అశ్విన్‌, ఉమేశ్‌ 197 పరుగులకు కుప్పకూల్చారు. తొలి ఇన్నింగ్స్‌లో విలువైన 88 పరుగుల ఆధిక్యం ఆసీస్‌ సొంతమైంది. నేడు మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా 76 పరుగుల లక్ష్యంతో ఛేదన షురూ చేయనుంది.
పుజార ఒక్కడే
భారత బ్యాటర్లు వరుసగా రెండో ఇన్నింగ్స్‌ చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్‌లో చేసిన తప్పిదాలనే మళ్లీ పునరావృతం చేశారు. ఓపెనర్లు సహా మిడిల్‌ ఆర్డర్‌లోనూ ఎవరూ బాధ్యతగా ఆడలేకపోయారు. ఆసీస్‌ సీనియర్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ లంచ్‌ తర్వాత సెషన్‌లో మ్యాజిక్‌ చేశాడు. భారత బ్యాటర్లను కుదురుగా ఆడనివ్వలేదు. రోహిత్‌ శర్మ (12), శుభ్‌మన్‌ గిల్‌ (5) నిరాశపరిచారు. క్రీజులో నిలదొక్కుకున్నట్టే కనిపించిన విరాట్‌ కోహ్లి (13).. కునేమాన్‌పై చెత్త షాట్‌కు వెళ్లి వికెట్‌ కోల్పోయాడు. రవీంద్ర జడేజా (7) సైతం లయాన్‌ ముందు తేలిపోయాడు. ఈ సమయంలో పుజార (59), అయ్యర్‌ (26) ఎదురుదాడి చేశారు. వేగంగా పరుగులు పిండుకున్నారు. శ్రేయస్‌ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఆసీస్‌పై ఒత్తిడి పెంచాడు. కానీ కంగారూ కెప్టెన్‌ స్మిత్‌.. బంతిని మిచెల్‌ స్టార్క్‌కు అందించి ప్రమాదకరంగా మారుతున్న భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీంతో మ్యాచ్‌ మళ్లీ ఆసీస్‌ చేతుల్లోకి వెళ్లింది. అశ్విన్‌ (16), అక్షర్‌ పటేల్‌ (15 నాటౌట్‌) చివర్లో ఫర్వాలేదనిపించారు. 60.3 ఓవర్లలో 163 పరుగులకు భారత్‌ కథ ముగిసింది.
11 పరుగులకే 6 వికెట్లు
అంతకుముందు, రెండో రోజు తొలి సెషన్లో అశ్విన్‌, ఉమేశ్‌ అదరగొట్టారు. 186/4తో ఉన్న ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగింది. ఈ పరిస్థితుల్లో ఆసీస్‌ మరోసారి బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాదేమో అనిపించింది. కానీ ఉమేశ్‌ యాదవ్‌ మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టగా..మరో ఎండ్‌లో అశ్విన్‌ మాయ కొనసాగింది. 34 బంతుల వ్యవధిలో 11 పరుగులకు 6 వికెట్లు పడగొట్టిన ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌లు భారత్‌ను తిరిగి రేసులోకి తీసుకొచ్చారు. 76.3 ఓవర్లలో 197 పరుగులకు ఆసీస్‌ కుప్పకూలింది. ఉదయం సెషన్‌లో భారత బ్యాటర్లు చేసిన అద్వితీయ ప్రదర్శన నేడు విలువైన ఆత్మవిశ్వాసం అందిస్తోంది. అదే తరహా ప్రదర్శన పునరావృతం చేయగలిగితే 76 పరుగులను కాపాడుకోవటం పెద్ద కష్టం కాబోదని భారత్‌ భావిస్తోంది.
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 109/10
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 197/10
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (ఎల్బీ) లయాన్‌ 12, గిల్‌ (బి) లయాన్‌ 5, పుజార (సి) స్మిత్‌ (బి) లయాన్‌ 59, కోహ్లి (ఎల్బీ) కునేమాన్‌ 13, జడేజా (ఎల్బీ) లయాన్‌ 7, అయ్యర్‌ (సి) ఖవాజ (బి) స్టార్క్‌ 26, భరత్‌ (బి) లయాన్‌ 3, అశ్విన్‌ (ఎల్బీ) లయాన్‌ 16, అక్షర్‌ నాటౌట్‌ 15, ఉమేశ్‌ (సి) గ్రీన్‌ (బి) లయాన్‌ 0, సిరాజ్‌ (బి) లయాన్‌ 0, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (60.3 ఓవర్లలో ఆలౌట్‌) 163.
వికెట్ల పతనం : 1-15, 2-32, 3-54, 4-78, 5-113, 6-118, 7-140, 8-155, 9-155, 10-163.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 7-1-14-1, కునేమాన్‌ 16-2-60-1, లయాన్‌ 23.3-1-64-8, టాడ్‌ మర్ఫీ 14-6-18-0.