ఆ పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందే

–  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో వాదనలు
నవతెలంగాణ – హైదరాబాద్‌
షాద్‌నగర్‌ సమీపంలో 2019 డిసెంబర్‌ ఆరో తేదీన జరిగిన దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాల్సిందేనని సీనియర్‌ న్యాయవాది (ఎమికస్‌క్యూరీ) డి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రాణాలను కాపాడుకునే క్రమంలోనే ఎన్‌కౌంటర్‌ చేశారో లేదో కింది కోర్టులో కేసు విచారణలో తేలుతుందని, అప్పటి వరకు పోలీసులపై కూడా కేసులు నమోదు చేయాలని కోరారు. దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై దాఖలైన రిట్‌ను సోమవారం చీఫ్‌జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్‌ ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ప్రకాశ్‌రెడ్డి వాదనలు కొనసాగిస్తూ, సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికలో పోలీసుల పాత్ర ఉందన్నారు. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపారో లేదో విచారణలో తేలాలన్నారు. ఆత్మరక్షణకే పోలీసులు కాల్పులు జరిపామని చెబుతున్నారనీ, ఈ విషయం ట్రయల్‌కోర్టులో తేలాల్సి ఉందని చెప్పారు. దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న కేసులో తమను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతించాలంటూ తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కోరింది. వాదనల తర్వాత తగిన నిర్ణయాన్ని వెలువరిస్తామని హైకోర్టు చెప్పింది. దిశ తండ్రి కూడా ఇంప్లీడ్‌ అవుతానని చెప్పారు.
సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికపై అభ్యంతరాలుంటే ఇంప్లీడ్‌ కావచ్చని చెప్పిన హైకోర్టు విచారణ ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.
కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలపై రిట్‌
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డుకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వికాస్‌ మంచ్‌ హైకోర్టును ఆశ్రయించింది. బోర్డును జీహెచఎంసీలో విలీనం చేయాలనే ప్రయత్నాలు జరుగు తున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువ డిందని, వెంటనే అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరింది.
నేడు హైకోర్టుకు హోలీ సెలవు
హోలీ పండుగ సందర్భంగా మంగళవారం హైకోర్టుకు సెలవు. ఈనెల 8వ తేదీన సెలవని గతంలో ప్రకటించారు. తిరిగి 9న హైకోర్టు పనిచేస్తుంది. మంగళవారం సెలవు కారణంగా అందుకు ప్రతిగా సెప్టెంబర్‌ 2వ తేదీ శనివారం హైకోర్టు పనిచేస్తుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ తెలిపారు.