ఇండోర్‌లో మూడో టెస్టు

–  ఆసీస్‌, భారత్‌ టెస్టు వేదిక మార్పు
ముంబయి : భారత్‌, ఆస్ట్రేలియా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ మూడో టెస్టును ధర్మశాల నుంచి ఇండోర్‌కు మార్చుతూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అతిశీతల వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల నూతన డ్రైనేజీ వ్యవస్థ పనులతో అవుట్‌ఫీల్డ్‌ దగ్గర పచ్చిక తక్కువైంది. దీంతో మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదికను ఇండోర్‌కు మార్పు చేసింది. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం గతంలో రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. న్యూజిలాండ్‌ (2016), బంగ్లాదేశ్‌ (2019) టెస్టులు ఇక్కడ జరుగగా.. రెండింటా భారత్‌ భారీ విజయాలు సాధించింది. ఆ రెండు టెస్టుల్లో అశ్విన్‌ ఏకంగా 18 వికెట్లు పడగొట్టడం విశేషం. భారత్‌, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానుంది.