ఉత్కంఠగా టెన్నిస్‌ పోటీలు

హైదరాబాద్‌ : 13వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. జూబ్లిహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా 390 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. మెన్స్‌ సింగిల్స్‌ (30) భార్గవ్‌ 8-0తో సాయినాథ్‌పై, ఈశ్వర్‌ సాయి 8-3తో జయేశ్‌పై, అనిరుధ్‌ 8-1తో ప్రమోద్‌పై, సురేశ్‌ 8-0తో సిరశాలపై విజయాలు సాధించారు. మెన్స్‌ సింగిల్స్‌ (40)లో చంద్రశేఖర్‌పై కిరణ్‌ 8-3తో, జహంగిర్‌పై అశ్విన్‌ కుమార్‌ 8-3తో, సురేశ్‌పై యోగేశ్‌ 8-4తో, దాసుపై శ్రీకాంత్‌ 8-0తో గెలుపొందారు. మహిళల సింగిల్స్‌ (ఓపెన్‌) సౌమ్య నాయుడు 8-0తో ప్రణితపై ఏకపక్ష విజయం నమోదు చేయగా.. గాయత్రి 8-2తో ప్రశాంతిపై, అరుణ భాస్కర్‌ 8-4తో అలేఖ్యపై, జానకి 8-0తో నీలం చోప్రపై పైచేయి సాధించారు.