ఎన్నిపరిశ్రమలొచ్చాయి… ఎంతమందికి ఉపాధి కల్పించారు?

– శ్వేతపత్రం విడుదల చేయండి
– ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు న్యాయం చేయండి
– కనీస వేతనాలను సవరించండి
– ఔటర్‌ రింగ్‌రోడ్డుపై టోల్‌ను రద్దుచేయండి
– ఏసీడీపీ నిధులను రూ.10 కోట్లకు పెంచాలి : కాంగ్రెస్‌ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రాష్ట్రానికి ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? అసలు ఎన్ని కంపెనీలు స్థాపించబడ్డాయి? ఎంత మందికి ఉపాధి కల్పించారు?’ అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమైన పరిశ్రమల స్థాపనకు కేంద్రం నుంచి నిధులు ఏమైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఇవ్వకపోతే కేంద్రం నిర్లక్ష్యంపై కొట్లాడటంపై తామూ కలిసివస్తామని చెప్పారు. రాష్ట్రంలో 26 లక్షల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఉన్నాయనీ, అందులో 40 లక్షల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. కరోనా కాలంలో ఎక్కువ సంఖ్యలో అవి మూతపడటంతో కార్మికులు పెద్దఎత్తున రోడ్డునపడ్డ విషయాన్ని ప్రస్తావించారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు కరెంట్‌ బిల్లుల మాఫీ, సబ్సిడీలు, రాయితీలు, లోన్లు, ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. కనీసవేతనాలను సవరిస్తూ జీవోలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ టవర్లు, ఇంకిబేషన్‌ సెంటర్లను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త మున్సిపాల్టీల్లో ఉద్యోగుల కొరత ఉందనీ, ఆ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఒక్కో మున్సిపాల్టీలో ఒక్కోరకంగా ఇంటిపన్ను వేయడం తగదన్నారు. రాష్ట్రస్థాయిలో శాస్త్రీయంగా ఒకే పన్ను విధానం తేవాలని కోరారు. అక్రమకట్టడాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 160 కిలోమీటర్ల ఔటర్‌రింగురోడ్డుపై ఉన్న టోల్‌ ట్యాక్స్‌ను ఎత్తేయాలని కోరారు. ప్రజల అభిప్రాయాలను తీసుకుని మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి ఫండ్‌ (ఏసీడీపీ)ను రూ.10 కోట్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ కోసం మానిటరింగ్‌ కమిటీని వేయాలన్నారు. టీచర్‌ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇంకా 80 అడిషనల్‌ కోర్టుల అవసరం ఉందనీ, వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమం కోసం కేటాయించిన రూ.100 కోట్ల ఫండ్‌ను ట్రస్టు ద్వారా కాకుండా బార్‌ కౌన్సిల్‌ ద్వారా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.