నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ-2) పరీక్షలు ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. అదేనెల 20వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ మూడు నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. దీంతో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలుంటాయని వివరించారు. ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.15 వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలుంటాయని వివరిం చారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తుండడం గమ నార్హం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 21న జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించి రికార్డుల్లో పొందు పరచాలని కోరారు. పాఠశాలల చివరి పనిదినం ఏప్రిల్ 24న తల్లిదండ్రులతో సమావేశాలను నిర్వహించాలనీ, ప్రొగ్రెస్ కార్డుల పై చర్చించి రికార్డుపై సంతకం చేసి తరగతి ఉపాధ్యాయులకు అందించాలని సూచించారు.