ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ

–   గ్రూప్‌-2కు 5.51 లక్షల దరఖాస్తులు
–  ముగిసిన గడువు
–  త్వరలో పరీక్ష తేదీల ఖరారు : టీఎస్‌పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌-2 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 దరఖాస్తులొచ్చాయని వివరించారు. పరీక్ష తేదీలను త్వరలోనే ఖరారు చేసి ప్రకటిస్తామని వెల్లడించారు. ఇతర వివరాలకు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల సంఖ్య అధారంగా గ్రూప్‌-2కు సంబంధించి ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 439 పోస్టులకు 2015, డిసెంబర్‌ 30న తొలి గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం విదితమే. ఆ తర్వాత 593 గ్రూప్‌-2 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో 2016, సెప్టెంబర్‌ ఒకటో తేదీన 1,032 పోస్టుల భర్తీకి గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. గ్రూప్‌-2కు 7,89,985 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది నవంబర్‌ 11,13 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల 5.17 లక్షల మంది హాజరయ్యారు. అంటే తొలి గ్రూప్‌-2 కంటే ప్రస్తుతం 2,38,042 దరఖాస్తులు తగ్గడం గమనార్హం. అప్పుడు ఒక్కో పోస్టుకు 765 మంది పోటీ పడ్డారు. ఇప్పుడు ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడుతున్నారు.