కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర : మంత్రి జగదీశ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ఒకరిద్దరు పెట్టుబడిదారు లకు కట్టబెట్టేందుకే ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే విద్యుత్‌ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరించేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎన్ని కుట్రలు చేసినా… రాష్ట్రంలో అలా జరగనివ్వమనీ, రైతులతోపాటు అన్ని రకాల వినియోగ దారులకూ 24 గంటలపాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సూర్యాపేట జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు, ఐఎన్‌టీయూసీతోపాటు ఆ పార్టీ మైనారిటీ విభాగం నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికీ జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విద్యుత్‌ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటుపరం చేసేది లేదని నొక్కి చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టేది లేదంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారని వివరించారు. అయినా ఆ రంగానికి సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది గల్లీ లీడర్లు అవగాహన లేమితో అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ఊహించిన దానికంటే రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతూ వస్తోందని తెలిపారు. సాధారణంగా మార్చిలో వచ్చే పీక్‌ డిమాండ్‌ ఈసారి జనవరిలోనే వచ్చిందన్నారు. ఆ రకంగా గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌ వినియోగం నమోదైందని వివరించారు. అయినప్పటికీ వినియోదారులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నాణ్యమైన కరెంటును నిరంతరంగా సరఫరా చేస్తామని హామీనిచ్చారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎక్కడ విద్యుత్‌ లభించినా.. అక్కడి నుంచి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్‌ ఆదేశించారని వెల్లడించారు. అందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడొద్దంటూ కేసీఆర్‌ సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో 17 వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ వచ్చినా ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. గత నెల్లో ఎన్టీపీసీ, ఇతర రెండు విద్యుత్‌ ప్లాంట్లలో కొంత సమస్య రావటం వల్ల కరెంటు సరఫరాలో అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని మంత్రి ఈ సందర్భంగా అంగీకరించారు. అది కూడా రెండు మూడ్రోజులేనని వివరించారు.
బీజేపీ, కాంగ్రెస్‌తో రాష్ట్రానికి నష్టం…
బీజేపీ, కాంగ్రెస్‌తో రాష్ట్రానికి తీరని నష్టమని మంత్రి ఈ సందర్భంగా విమర్శించారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోందని అన్నారు. ఆ పార్టీ గల్లీ నాయకత్వంతో క్యాడర్‌ విసిగిపోయారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ ఆ పార్టీని నడపలేరనే విషయం తేలిపోయిం దన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి దేశంలో ఒక్క కేసీఆర్‌కే ఉందని వ్యాఖ్యా నించారు. బీఆర్‌ఎస్‌తోనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
నేడు ముంబయికి ఎమ్మెల్సీ కవిత
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ముంబయికి బయల్దేరి వెళ్లనున్నారు. ప్రముఖ మీడియా సంస్థ అక్కడ నిర్వహించే ‘ఐడియాస్‌ ఆఫ్‌ ఇండియా సమ్మిట్‌-2023’లో ఆమె పాల్గొంటారు. ‘2024 ఎన్నికలు-విపక్షాల వ్యూహం’ అనే అంశంపై జరిగే చర్చా వేదికలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు.
బీఆర్‌ఎస్‌ గూటికి విజయవాడ మాజీ మేయర్‌
విజయవాడ మాజీ మేయర్‌ తాడి శకుంతల బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ సమక్షంలో ఆమె శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్నారు. భవిష్యత్తులో తమ పార్టీలోకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారీ చేరికలుంటాయని చంద్రశేఖర్‌ ఈ సందర్భంగా తెలిపారు.