కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్రం

–   సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
–  ఆలేరు, మోటకొండూరు మండలాల్లో జీపీ కార్మికుల పాదయాత్ర
–  విజయవంతంగా వంద కిలోమీటర్లు పూర్తి
నవతెలంగాణ -ఆలేరు రూరల్‌
కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన పాదయాత్ర గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతాపురి, దిలవారిపూర్‌ గ్రామాల్లో కొనసాగింది. దిలవారిపూర్‌ గ్రామంలో జరిగిన సభలో పంచాయతీ కార్మికులు పాదయాత్ర బృందానికి తమ బాధలను విన్నవించుకున్నారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేసి కనీస వేతనం నిర్ణయించాలని సుదీర్ఘకాలం పోరాటం చేస్తే.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనా లేకుండా జీవో నెంబర్‌ 51 విడుదల చేసి.. 500 జనాభాకు ఒక కార్మికుడు చొప్పున లెక్కించి వేతనాన్ని రూ.8500 నిర్ణయించిందన్నారు. అదనంగా ఉన్న కార్మికులకు ఎలాంటి వేతనాలూ చెల్లించడం లేదన్నారు. ఒక కార్మికునికి ఇచ్చే వేతనాన్ని అక్కడ పనిచేసే కార్మికులందరూ పంచుకుంటున్నామని, ఫలితంగా రూ.3500 నుంచి 4,500 మాత్రమే వేతనాలు పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నా కారోబార్‌ బిల్‌ కలెక్టర్‌కు కేవలం రూ.6000 ఇస్తున్నారని కార్మికులు తెలిపారు. కుటుంబం గవడం కష్టంగా ఉందని, పెరిగిన ఖర్చులకు తగినట్టు వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అందుకోసం తామూ పాదయాత్రలో భాగస్వాములం అవుతామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి జీవో నెంబర్‌ 60 ప్రకారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జీపీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గణపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తునికి మహేష్‌ వినోద్‌ కుమార్‌ బృందంగా పాదయాత్ర పాలకుర్తి నుంచి మొదలుకొని మొదలు పెట్టి హైదరాబాద్‌ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పాదయాత్ర ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరాపార్క్‌ వద్ద ముగుస్తుందని తెలిపారు. అనంతరం పాదయాత్ర మోటకొండూరు మండలంలో కొనసాగింది. పాదయాత్రకు సంఘీభావంగా కలుగీత కార్మిక సంఘం రైతు సంఘం, సీపీఐ(ఎం), సీపీఐ, వివిధ సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం, కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు, రాష్ట్ర సోషల్‌ మీడియా ఇన్‌చార్జి జగదీష్‌, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుపటి వెంకటేష్‌, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు ఇక్బాల్‌, సీఐటీయూ మోటకొండూరు మండల అధ్యక్షులు కొల్లూరు ఆంజనేయులు, నాయకులు సంగీ రాజు, ఆడెపు స్వామి, చెక్క దశరథ, అంజయ్య పాల్గొన్నారు.
సక్సెస్‌గా వంద కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి
పంచాయతీ కార్మికుల కోసం తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ చేస్తున్న పాదయాత్ర 100 కిలోమీటర్లకు చేరుకున్నది. పాదయాత్ర ఈ నెల 12న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. వరంగల్‌ జిల్లాలోని మూడు నియోజకవర్గాల మీదుగా యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గానికి చేరుకున్నది. ఆ జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రంలో వంద కిలోమీటర్ల మైలురాయిని పాదయాత్ర చేరుకున్నది. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను నిరసిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రతినెలా జీతాలివ్వాలనే డిమాండ్‌తో కొనసాగుతున్నది. వారికిస్తున్న రూ.8,500 జీతాన్ని ఇద్దరు, ముగ్గురు కార్మికులు పంచుకుంటున్న తీరును పాదయాత్ర బృందం ఎత్తిచూపుతున్నది. ఆ జీతాలతో ఎలా బతకాలో చెప్పాలని కార్మికుల ముందే సర్పంచ్‌లను అడుగుతున్నది. పాదయాత్ర బృందం లేవనెత్తుతున్న డిమాండ్లన్నీ న్యాయసమ్మతమైనవని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, తదితర పార్టీల సర్పంచులు కూడా అంటున్న పరిస్థితి. పార్టీలకతీతంగా సర్పంచులు పాదయాత్రకు ప్రతి ఊర్లోనూ స్వాగతం పలుకుతున్నారు. మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేసి ప్రతి కార్మికుడికీ రూ.26 వేల వేతనం చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో పాదయాత్ర ముందుకు సాగుతున్నది. ఈ పాదయాత్రకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్‌ నేతృత్వం వహిస్తుండగా జీపీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గ్యార పాండు, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గణపతి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తునికి మహేష్‌, వినోద్‌ కుమార్‌ బృంద సభ్యులుగా ఉన్నారు.