కిసాన్‌ ఆగ్రో ఫీడ్స్‌ కంపెనీని మూసేయాలి

– ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.పార్థసారథి
– దీక్షకు మద్దతు తెలిపిన లాయర్స్‌ యూనియన్‌
నవతెలంగాణ-యాచారం
ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విషపూరితమైన కిసాన్‌ ఆగ్రో ఫీడ్స్‌ కంపెనీని ప్రభుత్వం వెంటనే మూసేయాలని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.పార్థసారథి డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో బొక్కల కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసన దీక్ష శనివారం పదో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ బృందం మద్దతు తెలిపింది. అనంతరం బొక్కల కంపెనీ పరిసరాలను లాయర్స్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. కోళ్లకు, చేపలకు వేసే ఫీడ్‌, డాల్డా, నూనె, టీ పౌడర్‌ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. దాని నుంచి వచ్చే విషపూరిత పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. కంపెనీ చుట్టుముట్టు వచ్చే వాసన భరించలేక 45 నుంచి 60 ఏండ్ల వయస్సు వారు మూడేండ్లలో సుమారు 150 మంది చనిపోయారని తెలిపారు. ఇంతటి ప్రమాదకరమైన కంపెనీని పొల్యూషన్‌, ఎస్‌ఓటీ, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారు పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. ఈ కంపెనీలో కుళ్లిపోయిన మాంసం, వ్యర్థ పదార్థాల నిల్వల వల్ల కొత్తపల్లి, తక్కలపల్లి, కిషన్‌ పల్లి, గ్రామాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కంపెనీని ఎత్తివేసి, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.వనజ, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు కె.అరుణ్‌కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శి పి.గణేష్‌, జిల్లా కమిటీ సభ్యులు రూప తదితరులు పాల్గొన్నారు.