కేసీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

–  పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, విజయన్‌ సహా పలువురు సీఎంల విషెస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి స్వయంగా సీఎంతో ఫోన్లో మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్‌, ఢిల్లీ, పంజాబ్‌, తమిళనాడు, ఏపీ, అస్సాం ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, భగవంత్‌సింగ్‌ మాన్‌, స్టాలిన్‌, వైఎస్‌ జగన్‌, హిమంత బిశ్వశర్మ, మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలంటూ వారు ఆకాంక్షించారు. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కర్నాటక, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేశ్‌ యాదవ్‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, హైదరాబాద్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్‌ విన్‌ వోయెన్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు, సినీ హీరో మహేశ్‌బాబు తదితరులున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నేతృత్వంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో మానసిక వికలాంగు లకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ భవన్‌ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కట్టెల శ్రీనివాస యాదవ్‌ తదితరలు పాల్గొన్నారు. కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో అక్కడి సిబ్బంది సంబురాలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి వెంకట నారాయణ, సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహారావు, పీఆర్వో రమేశ్‌ హజారీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌తోపాటు లండన్‌, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, ఒరిస్సాలో కూడా కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనం గా నిర్వహించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.