నవతెలంగాణ-కల్చరల్
కొలకలూరి పురస్కారాల ప్రధానోత్సవ సభ ఆదివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగాయి. కొలకలూరి మధుజ్యోతి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి కిషన్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పురస్కారాలు నాలుగు విశ్వవిద్యాలయాలు ఇస్తున్న గొప్ప పురస్కారాలుగా భావించాలన్నారు. కొలకలూరి భగీరథీ కవితా పురస్కారాన్ని యార్లగడ్డ రాఘవేంద్ర (పచ్చికడుపు వాసన), కె. ఆనందాచారి (ఇక ఇప్పుడు), కొలకలూరి విశ్రాంతమ్మ నాటిక పురస్కారాన్ని ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ (ఆకెళ్ళ నాటికలు), కొలకలూరి రామయ్య పరిశోధన పురస్కారాన్ని ఎం.దేవేంద్ర (తెలంగాణ కథ- వర్తమాన జీవన చిత్రణ), ఎ.ఎ.నాగేంద్ర ( రాచపాలెం సాహిత్య విమర్శ – సమగ్ర పరిశీలన) స్వీకరించారు. పురస్కారాల కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేసి స్వీకర్తలను సత్కరించారు.