క్యూబా, పాలస్తీనా దేశాలకు సంఘీభావంగా నిలబడాలి

–  ఏఐపీఎస్‌ఓ తీర్మానం
– ముగిసిన జాతీయ మహాసభలు.
చండీగఢ్‌ : సోషలిస్టు దేశమైన క్యూబా పై అమెరికా తన పెత్తనం చెలాయిస్తూ ఆంక్షలు విధిస్తూ ఉండగా మరొక వైపు పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకునే దిశగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడులను నిరసిస్తూ క్యూబా పాలస్తీనా దేశాలకు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని అలాగే రష్యా ఉక్రెయిన్‌ దేశాల మధ్య సాగుతూ ఉన్న యుద్ధం నివారించాలని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్‌ఓ) జాతీయ మహాసభల్లో ఏకగ్రీవంగా తీర్మానించారు. స్థానిక బార్‌ కౌన్సిల్‌ భవన్‌ నందు రెండు రోజులుగా జరుగుతున్న అయిప్సో జాతీయ మహాసభలు నేటి సాయంత్రంతో ముగిశాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, మతోన్మాదం, కోవిడ్‌ తదనంతర పరిస్థితులు తదితర అంశాలతో పాటుగా అయిప్సో పటిష్టత పై చర్చలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అందరికంటే అతి చిన్న వయసు ఎస్‌ ఎఫ్‌ ఐ నుంచి తమిళనాడుకు చెందిన మృదుల మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూత్వ, అర్‌ ఎస్‌ ఎస్‌ విధానాలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు,ఒకే భాష పేరుతో ప్రజల మధ్య ఉన్న ఐక్యత కు విఘాతం కల్గిస్తూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ సంక్షోభం సమయంలో కార్పొరేట్‌ వర్గాలు లబ్ది పొందగా పేద మధ్య తరగతి వాళ్ళు విద్య ఉపాధికి సైతం దూరం అయ్యారని, కోవిడ్‌ నివారణ లో క్యూబా ,రష్యా దేశాలు ముందుగా వ్యాక్సిన్‌ తయారీ లో అగ్రస్థానంలో ఉండగా, మోడీ పాలకులు మాత్రం ఆవును తెర పైకి తెచ్చి గో మూత్రం, పేడ, గో మాత అంటూ తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉన్నారని వివరించారు. ఇటువంటి వాటిపై ప్రజల్లో చైతన్య పరిచి మెరుగైన సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. కాగా ప్రతినిధుల సభకు అధ్యక్ష వర్గంగా డి .సుధాకర్‌, సిపి నారాయణ,సునీత,యాదవ రెడ్డిలు వ్యవహరించారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి నరమాల సతీష్‌ కుమార్‌ చర్చల్లో పాల్గొన్నారు. శత్రువును మట్టి కరిపించెందుకు కర్రసాము, కత్తి యుద్దాలు యుద్ధకళలు, పంజాబీ వేష ధారణలో నృత్యాలు ఆకర్షించాయి.