క్యూరేటర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలి

–  పిచ్‌ తయారీపై ఇయాన్‌ చాపెల్‌
మెల్‌బోర్న్‌ : భారత క్రికెట్‌పై విమర్శలు చేసేందుకు ముందు వరుసలో నిల్చునే మాజీ క్రికెటర్లలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ ఒకరు. 79 ఏండ్ల ఇయాన్‌ చాపెల్‌ ఏమాత్రం అవకాశం చిక్కినా.. భారత క్రికెట్‌ను విమర్శించేందుకు వెనక్కి తగ్గడు. తాజాగా బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో రూపొందించిన పిచ్‌లపై చాపెల్‌ స్పరదించారు. టెస్టు మ్యాచ్‌కు ఎటువంటి పిచ్‌ను అందించాలనే నిర్ణయం పూర్తిగా క్యూరేటర్‌కే వదిలేయాలని.. క్రికెటర్లు, ఆఫీస్‌ బేరర్లు జోక్యం చేసుకుంటే అదో చెత్త పని అవుతుందని అన్నారు. ‘ పిచ్‌ ఎలా ఉండాలనే అంశంలో ఆటగాళ్లు, ఆడ్మినిస్ట్రేటర్లు క్యూరేటర్‌కు సూచనలు ఇస్తున్నారా? నేను విన్న అత్యంత చెత్త విషయం ఇదే. పిచ్‌ రూపకల్పన పూర్తిగా క్యూరేటర్‌కు వదిలేయాలి. మంచి పిచ్‌ను ఎలా చేయాలనే సంగతి అతడు చూసుకుంటాడు. ఆ పిచ్‌పై ఆటగాళ్లు ఆడాలి. ఎటువంటి పిచ్‌ కావాలో క్రికెటర్లే కోరుకుంటే.. కష్టాలకు ఆహ్వానం పలికినట్టే అవుతుంది. ఈ తరహా పిచ్‌ కావాలని కోరే క్రికెటర్లు, ఆఫీస్‌ బేరర్లను చెరువులో దూకమని చెప్పాలి’ అని చాపెల్‌ అన్నాడు. ఇక టీమ్‌ ఇండియా బ్యాటర్లపై చాపెల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు స్పెషలిస్ట్‌ పుజార, స్పిన్‌ ఎటాకర్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శ చేశాడు. ‘ చతేశ్వర్‌ పుజార నాకు ఎప్పుడూ ఆందోళనగానే కనిపిస్తాడు. అతడు ఒత్తిడిని ఏమాత్రం తీసుకోలేడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆడటంలో దిట్ట అని చెబుతున్నారు. ఆ సంగతి నేను చూడలేదు. సిరీస్‌లో ఇప్పటి వరకు అతడు స్పిన్‌పై ఏమాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ నిజానికి ఒత్తిడికి గురి చేస్తాడు’ అని చాపెల్‌ ఓ చానెల్‌తో పేర్కొన్నాడు.