గవర్నర్‌తో అబద్ధాలు చదివించారు

– హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌తో బడ్జెట్‌ ప్రసంగంలో అబద్ధాలు చదివించారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. అసెంబ్లీ సెషన్‌ అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే విధంగా ఉందన్నారు. వ్యవసాయానికి 24గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పడం తప్పు అన్నారు. కరెంటు లోడు తట్టుకోలేక సబ్‌స్టేషన్లు కుప్పకూలుతుండగా.. రైతుల మోటార్లు కాలిపోతున్నాయన్నారు. కనీసం రైతులకు ఆరేడు గంటలు కరెంటు రావడం లేదన్నారు. ధరణి గురించి గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. ధరణి గురించి చెప్పుకోవడానికి ప్రభుత్వం వెనుకడుగు వేయడానికి రైతుల ఆత్మహత్యలే కారణమన్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు పూర్తిగా నిర్మించలేదన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందన్నారు. ఉద్యోగ నియామకాల్లో తప్పులు ఎందుకు దొర్లుతున్నాయని ప్రశ్నించారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నియామకాల్లో జరిగిన తప్పులను సరిచేయాలన్నారు. నాలుగేండ్లుగా గ్రామ పంచాయతీలు, సర్పంచులకు నిధుల్లేవన్నారు.
24 గంటల కరెంటు ఇస్తే.. ఏ శిక్షకైనా రెడీ : ఎమ్మెల్యే రఘునందన్‌ రావు
రగవర్నర్‌ తమిళిసై బడ్జెట్‌ ప్రసంగమంతా ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్‌. జనాల నుంచి ఓట్లు రాబట్టుకోవడానికి ఆమెతో అన్ని తప్పులు చదివించారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా.. అంతా బాగుంది అనే విధంగా గవర్నర్‌ ప్రసంగంలో ఉంది. 24 గంటలు కరెంటు రైతులకు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా రెడీ.