నవ తెలంగాణ -బోనకల్
గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరీదు లక్ష్మయ్య, నాగలక్ష్మమ్మ దంపతుల రెండవ కుమారుడు రాకేష్ (18) మధిరలోని ఓ ప్రయివేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే రెండు రోజుల కిందట రాకేష్‌కు జ్వరం రావడంతో స్థానికంగా ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించారు. శనివారం ఉదయం గుండెలో నొప్పి వస్తుందని రాకేష్ చెప్పటంతో కుటుం బ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి గుండె సంబంధమైన వ్యాధి ఉందని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దాంతో కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం స్వగ్రామం తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి రాకేష్ గుండె నొప్పి వస్తుందని ఒక్కసారిగా మంచంపై పడుకొని వెంటనే ప్రాణాలు వదిలారు. ఇది ఇలా ఉండగా ఆదివారం సెలవు కావడంతో పాటు ఆర్థిక సమస్య కారణంగా సోమవారం హైదరాబాద్ తీసుకెళ్దామని అనుకున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ అంతలోనే రాకేష్ మృతి చెందటంతో కుటుంబ సభ్యుల రోదన వర్ణాతీతంగా ఉంది. విద్యార్థి మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాదఛా యలు కమ్ముకున్నాయి. సహచర విద్యార్థులు తరలివచ్చి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతదేహాన్ని సీపీఐ మండల కార్యదర్శి యంగళ ఆనందరావు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.