గోదారి పాట

తీరంలో
చంద్రుడు లాంతరు
బీర తీగ అల్లుకున్న
తాటాకు గుడిసె.

రాత్రి
ఒడ్డు పడవలో
పగలంతా పని చేసిన వలలు
ఒళ్ళు మరచి నిద్రిస్తున్నాయి.

ఎండిన కొబ్బరి మట్టలతో
రగిలిన రాళ్ళ పొయ్యిలో
కాలుతున్న చేపల వాసన.

వెన్నెలకు మత్తెక్కించే
చల్లని తాటికల్లు
చెరుకు తోటలనుండి
పలకరించే తీపి వాసన.

గోదావరి
సాయంకాలం అలా
ఒడ్డున కూర్చొని సేదతీరుతుంది.

దూరంగా
మరో పాత పడవ
ఇసుక తెన్నెలపై
పురాతన బైరాగి గీతమై
వలను సర్దుతుంది

మన్నెం విల్లంబును
విజయ గర్వంతో
గోదారిలో కడుగుతుంది.
పాయ నీటి చేతులెత్తి
వీర తిలకం దిద్దుతుంది.

అడవి పడుచు
అమాయకపు నవ్వులా
ఎంత తెల్లగా పారుతోంది
గోదావరి.

అది నల్లని చీకట్లు చీల్చుతూ
మెరిసే వెన్నెల కాంతి దారి.

– మణీందర్‌ గరికపాటి
9948326270