చిరాకేస్తుందా..?

ఈకాలం త్వరగా పొద్దెక్కుతుంది. వేడీ వేగంగా ప్రారంభమవుతుంది. కాబట్టి రోజూ చేసే సమయానికి గంట ముందుకి షెడ్యూల్‌ మార్చుకోండి. సూర్యోదయానికి ముందే వ్యాయామం ప్రారంభిస్తే.. వాతావరణం చల్లగా ఉంటుంది. చెమట సమస్య ఉండదు. చల్లటి నీటితో స్ప్రే బాటిల్‌ దగ్గర పెట్టుకోండి. వ్యాయామం తర్వాత ఒళ్లు వేడెక్కినట్టు అనిపించినా, చిరాగ్గా అనిపించినా ముఖాన ఈ నీటిని స్ప్రే చేసుకుంటే తాజాగా అనిపిస్తుంది. ఏకధాటిగా చేయడం కూడా ఒక సమస్యే! కాబట్టి, ఉదయం లేదా సాయంత్రం ఒక గంటన్నా పక్కా నియమాలొద్దు. ఉదయం 10 నిమిషాలే చేయాలనిపించిందా అంతే చేయండి. సాయంత్రం కుదిరితే అప్పుడే చేయండి. ఆఫీసులో భోజనమయ్యాక నాలుగు అడుగులేసినా సరే! వేడికి ఒంట్లో సత్తువ అంతా క్షీణిస్తున్నట్లు అనిపిస్తుంది. రోజూ చేసే వ్యాయామాలైనా ఈ కాలం త్వరగా అలసిపోతుంటాం. కాబట్టి పక్కాగా అనుకున్నవన్నీ చేసేయాలన్న కఠిన నిబంధనలొద్దు. ఇంట్లో, జిమ్‌లో కుస్తీలు పట్టలేకపోతున్నా అనిపిస్తే స్విమ్మింగ్‌, షటిల్‌, సాయంత్ర చల్లగాలికి నడక.. ఇలా ఏవైనా కొత్తవి ప్రయత్నించినా ప్రయోజనకరమే! దుస్తుల ఎంపికనీ చూసుకోవాలి. వదులుగా, తక్కువ వేడిని గ్రహించే లేత రంగు వస్త్రాలకే ప్రాధాన్యం ఇవ్వండి.