చేతన్‌ శర్మ రాజీనామా

ముంబయి : ఓ టీవీ చానెల్‌ శూల శోధన (స్టింగ్‌ ఆపరేషన్‌)లో భారత క్రికెట్‌లో పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేతన్‌ శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. బీసీసీఐ ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ పదవికి రాజీనామా చేస్తూ బోర్డు కార్యదర్శి జై షాకు లేఖ పంపాడు. చేతన్‌ శర్మ రాజీనామాను బోర్డు ఆమోదించినట్టు తెలుస్తోంది. డ్రెస్సింగ్‌రూమ్‌లో విభేదాలు, కోహ్లి కెప్టెన్సీ తొలగింపు సహా ఫిట్‌నెస్‌ లేకపోయినా బరిలోకి దిగుతున్నారంటూ చేతన్‌ శర్మ పిచ్చాపాటిగా మాట్లాడాడు. రహస్య కెమెరాలో చేతన్‌ శర్మ మాట్లాడిన వ్యాఖ్యలు బయటకు రావటంతో బోర్డు ఇరకాటంలో పడింది. వివరణ ఇచ్చుకునేందుకు చేతన్‌ శర్మకు ఓ అవకాశం ఇచ్చే ఆలోచనలో బోర్డు కనిపించినా.. చేతన్‌ శర్మ రాజీనామా సమర్పించాడు. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ వైఫల్యంతో సెలక్షన్‌ కమిటీ బోర్డు రద్దు చేసినా.. ఈ ఏడాద జనవరిలో చేతన్‌ శర్మకు మరోసారి చీఫ్‌ సెలక్టర్‌ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.