జయతీ ఘోష్‌కు అవార్డు

–  గ్లోబల్‌ అగ్రికల్చరల్‌ ఎకనామిక్‌కు ఎంపిక
న్యూఢిల్లీ :ప్రముఖ ఆర్థిక విశ్లేషకురాలు, జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌ గ్లోబల్‌ అగ్రికల్చరల్‌ ఎకనామిక్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక పెన్‌ /జెకె గాల్‌బ్రైత్‌ అవార్డు ఆమెను వరించినట్టు అగ్రికల్చరల్‌ అండ్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ అసోసియేషన్‌ (ఏఏఈఏ) ప్రకటించింది. జయతీఘోష్‌ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ అమ్హోర్ట్స్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. పరిశోధన, విద్య, ప్రజాసేవలో విజయాలను సాధించిన వారిని కెనడియన్‌ ఆర్థికవేత్త జాన్‌ కెన్నెత్‌ గాల్‌బ్రైత్‌ పేరు మీద ఈ అవార్డుతో సత్కరిస్తుంటారు. ఘోష్‌ గతేడాది ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌ స్థాపించిన ‘ఎఫెక్టివ్‌ మల్టీలెటరలిజం’ పై ఉన్నత స్థాయి సలహా మండలిలోనూ సభ్యురాలిగా నియమితులయ్యారు. కార్మికులు, మహిళలు, ఆర్థికశాస్త్ర అభివృద్ధిపై ఆమె అనేక వ్యాసాలతోపాటు, 20కి పైగా పుస్తకాలను రచించారు. 2023-24 బడ్జెట్‌లో సామాజిక వ్యయం, గ్రామీణ పేదలకు చోటు కల్పించలేదని విమర్శనాత్మకంగా రాశారు.