జీవిత పాత్రలో రాధిక

”స్వాతి ముత్యం, స్వాతి కిరణం’ లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల తరువాత దర్శకుడు వెంకట సత్య చెప్పిన ‘ఆపరేషన్‌ రావణ్‌’ స్క్రిప్ట్‌ నచ్చి నటనకి ప్రాధాన్యం ఉన్న, ఎంతో హద్యమైన జీవిత పాత్ర చేశాను’ అని సీనియర్‌ నటి రాధికా శరత్‌కుమార్‌ చెప్పారు. ‘పలాస 1978’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్‌ అట్లూరి కొత్త చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. మంగళవారం జరిగిన క్యారెక్టర్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో రాధికా శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘దర్శకుడికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ నా పాత్రని మలిచిన తీరు, చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు ఏక కాలంలో తమిళంలో విడుదలవుతున్న ఈ చిత్రంలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు. సుధాస్‌ మీడియా బ్యానర్‌ మీద ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్‌ ఏక్షన్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో రక్షిత్‌ అట్లూరి సరసన సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌గా నటించారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని, నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.