జునైద్‌, నసీర్‌ హత్యలకు వ్యతిరేకంగా హర్యానా, రాజస్థాన్‌ల్లో నిరసనలు

న్యూఢిల్లీ : గోగూండాల చేతిలో జునైద్‌, నసీర్‌ దారుణ హత్యలకు వ్యతిరేకంగా హర్యానా, రాజస్థాన్‌ నలుమూలల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జునైద్‌, నసీర్‌లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెల 24న హర్యానాలోని ఫిరోజ్‌పూర్‌ జిర్కా వద్ద వేలాది మంది ప్రదర్శన చేశారు. హర్యానా పోలీసులకు మెమోరాండం అందచేశారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ మద్దతు వంటి కారణాలతోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. కొన్నేళ్లుగా భజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలు ముస్లిములను లక్ష్యంగా చేసుకుని దాడులుకు దిగుతున్నారని విమర్శించారు. బస్సులు, టెంపోలపై జాతీయ జెండాలను ప్రదర్శిసూ.. ‘జునైద్‌, నసీర్‌లకు న్యాయం చేయాలి’ అని నినాదాలు చేశారు. గోగూండాలు చేసిన ఇతర హత్యలపైనా న్యాయ విచారణ జరిపించాలని, జునైద్‌, నసీర్‌ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, ఇద్దరి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మెమోరాండంలో డిమాండ్‌ చేశారు. గోగూండాలు ఆపహరించిన కారుపై విచారణ జరపాలని కోరారు. గోగూండాలు చేసిన ఇతర దాడుల్లోనూ ఈ కారును ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఘట్మీకలో నిరసనలు కొనసాగుతున్నాయి. మృతులు జునైద్‌, నసీర్‌ల స్వగ్రామమైన ఇక్కడ ఒక టెంటులో గత రెండు వారాల నుంచి శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ‘పార్లమెంట్‌లో మా స్వరం వినిపిస్తారని కాంగ్రెస్‌కు ఓటు వేశాం. కానీ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని నిశ్సబ్ధంగా ఉండమంటుంది’ అని గ్రామస్థులు విమర్శించారు. శాంతికి భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ రాజస్థాన్‌ పోలీసులు ఈ ఆందోళనలకు నోటీసులు ఇచ్చారు. అయినా గ్రామస్థులు ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక్కడి ముస్లిం ముసాఫిర్ఖానా వెలుపల రాజస్థాన్‌ ముస్లిం ఫోరమ్‌ సభ్యులు, ఇతర సంఘాలకు చెందిన వ్యక్తులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్‌ రైట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ దశరథ్‌ హినునిమా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గోగూండాలపై చెప్పుకోదగ్గ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. గతంలో హత్యకు గురైన కన్హయ్యలాల్‌ కుటుంబానికి, ప్రస్తుత జునైద్‌, నాసిర్‌ కుటుంబాలకు మధ్య ప్రభుత్వం చూపిస్తున్న తేడాను విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొన్ని విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.