టైటిల్‌ కొడతాం!

–  ప్రపంచంలోనే ఉత్తమ లీగ్‌గా వాలీబాల్‌
– హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ యజమాని అభిషేక్‌ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌ : గ్రామీణ క్రీడ వాలీబాల్‌ అందరికీ తెలుసు, అందరూ ఏదో ఒక దశలో ఆడే ఉంటారు!. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే దేశంలో రెండో ఏడాదిలోనే వాలీబాల్‌ తనకంటూ ఓ గుర్తింపు సాధించింది. రానున్న కాలంలో ప్రపంచంలోనే ఉత్తమ స్పోర్ట్స్‌ లీగ్‌గా ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ఎదగనుందని హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ యజమాని అభిషేక్‌ రెడ్డి కనకాల అన్నారు. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 2 సీజన్‌ రెండో అంచె మ్యాచులకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. హైదరాబాద్‌ మ్యాచుల ముగింపు సందర్భంగా బ్లాక్‌హాక్స్‌ యజమాని అభిషేక్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే ఉత్తమ లీగ్‌ : ‘ ప్రైమ్‌ వాలీబాల్‌ రెండో సీజన్‌లోనే గొప్ప విజయం సాధించింది. టెలివిజన్‌, ఓటీటీ వేదికలో రికార్డు వీక్షణలు నమోదయ్యాయి. కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తొలి సీజన్‌ను నిర్వహించాం. ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతగా రెండో సీజన్‌లో అభిమానుల సమక్షంలో హైదరాబాద్‌లో మ్యాచులు నిర్వహించాం. ఈ ఏడాది లీగ్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. స్వదేశీ ఆటగాళ్లు గొప్పగా రాణిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లను సబ్‌స్టిట్యూట్‌ చేసే స్థాయికి యువ ఆటగాళ్లు ఎదిగారు. బ్లాక్‌హాక్స్‌ సైతం యువకులపైనే పెట్టుబడి పెట్టింది. కెప్టెన్‌ గురు ప్రశాంత్‌ వయసు 23, బ్లాక్‌హాక్స్‌ జట్టు సగటు వయసు 22 మాత్రమే. లీగ్‌లోనే అత్యంత పిన్న వయస్కులను కలిగిన జట్టు హైదరాబాద్‌. కచ్చితంగా బ్లాక్‌హాక్స్‌ టైటిల్‌ కొడుతుంది. రానున్న సీజన్లలో ఈ యువ ఆటగాళ్లను అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తూ.. అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణలో ఆటను అభివృద్దికి చేసేందుకు కృషి చేస్తున్నాం. త్వరలోనే హైదరాబాద్‌లో ప్రపంచ శ్రేణి సదుపాయాలతో వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటు చేయనున్నాం. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ విజేత ప్రపంచ క్లబ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది. రెండో సీజన్లోనే ఈ లీగ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. అనతి కాలంలోనే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ప్రపంచంలోనే ఉత్తమ స్పోర్ట్స్‌ లీగ్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. కమర్షియల్‌ కోణంలోనూ ప్రైమ్‌ వాలీబాల్‌ విజయవంతం సాధించటం ఆనందానిస్తోంది’ అని అభిషేక్‌ రెడ్డి తెలిపారు.