ట్రెజరీల్లో మంజూరు చేసిన బిల్లులు చెల్లించాలి

– మూడు డీఏలను విడుదల చేయాలి : టీపీటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులను ట్రెజరీల్లో ఆమోదించి ఈ కుబేర్‌లో నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం సరైంది కాదనీ, వాటిని వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ అంశంపై ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావుకు లేఖ రాశామని పేర్కొన్నారు. పీఆర్సీ బకాయిల విషయంలో సైతం 12 నెలలకు బిల్లులు చేస్తే కేవలం మూడు నెలలు చెల్లించారని గుర్తు చేశారు. తొమ్మిది నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెలల తరబడి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లు, జీపీఎఫ్‌, సరెండర్‌ లీవ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, సెలవు వేతనాలు వంటి బిల్లులన్నీ ట్రెజరీల్లో ఆమోదం పొందినా ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ కావడం లేదని తెలిపారు. అందువల్ల ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లుల నగదును వెంటనే చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.