సమానత్వానికి యూనిఫాం సివిల్‌ కోడ్‌ అవసరం లేదు

– లా కమిషన్‌ మాజీ సభ్యులు కీర్తి సింగ్‌
నవ తెలంగాణ – హైదరాబాద్‌ బ్యూరో
సమానత్వానికి ఏకరూప సివిల్‌కోడ్‌ అవసరంలేదని సుప్రీంకోర్టు న్యాయవాది, లా కమిషన్‌ మాజీ సభ్యులు కీర్తి సింగ్‌ అన్నారు. ఐలు సంఘం హైదరాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్‌బి నగర్‌లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో మహిళా చట్టాలు, జెండర్‌ జస్టిస్‌పై కీర్తిసింగ్‌ ఉపన్యాసం చేశారు. మహిళల హక్కుల రక్షణ కోసం చట్టాలున్నా, వాటి రక్షణ కోసం మహిళా సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా..ఇప్పటికీ మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. చట్టాలపై మహిళలకు అవగహన కల్పించడం అత్యవసరమన్నారు. రాజ్యాంగంలో చెప్పినట్లుగా సమానత్వం కోసం ఎస్సి, ఎస్టిలకు ప్రత్యేక అధికారాలు కల్పించాల్సి ఉందని తెలిపారు. ఆర్టికల్‌ 21లో మహిళల గోప్యత గురించి స్పష్టంగా ఉందన్నారు. జీవ సంబంధాల్లో వస్తున్న మార్పులను గుర్తించాలి కానీ గుడ్డిగా వాటిని వ్యతిరేకించడం మంచిది కాదని చెప్పారు. వరకట్నం, అణిచివేత, మహిళల పట్ల చిన్నచూపు వంటి దుశ్చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐలు నాయకులు కె. పార్థసారధి, గోవర్ధన్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, అడ్వకేట్లు, ఐలు ప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love