డాక్టర్‌ ప్రీతి కేసులో దోషులను కఠినంగా శిక్షించాలి : ఐద్వా

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్‌ ప్రీతిని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబ సభ్యులు పలు అంశాలను తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. చాలా కాలంగా డాక్టర్‌ ప్రీతిని సీనియర్లు వేధిస్తున్నట్టు హెచ్‌ఓడీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని పేర్కొన్నారు. వారి నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ఘటన జరిగిందని తెలిపారు. ర్యాగింగ్‌ నిరోధక చట్టం ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాకతీయ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ నిరోధక చర్యలు చేపట్టక పోవడమేంటని ప్రశ్నించారు.ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆశాలత, సహాయ కార్యదర్శి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.