డా||రాధేయ, సింహప్రసాద్‌కు.. అమృతలత జీవన సాఫల్య పురస్కారాలు

– జిల్లా స్థాయి ఇందూరు అపురూప అవార్డుల ప్రదానం
నవతెలంగాణ-మాక్లూర్‌
సాహిత్య, సామాజిక, కళా, సేవా రంగాల్లో అత్యున్నత కృషి చేస్తున్న వారికి ప్రతి ఏడాది అందించే అమృత లత జీవన సాఫల్య పురస్కారాలు. జిల్లాస్థాయి ఇందూరు అపురూప అవార్డుల ప్రదానం ఆదివారం నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మామిడిపల్లిలోని అపురూప వెంటేశ్వరాలయంలో అవార్డుల ప్రదాత డాక్టర్‌ అమృత లత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలో 2022, 2023 సంవత్సరాలకు గాను అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. అమృతలత జీవనసాఫల్య పురస్కారం 2022లో ఆచార్య మనస చెన్నప్ప, సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డికి అందించగా, 2023లో సింహప్రసాద్‌, డా.రాధేయ, దాస్యం సేనాధిపతికు అందించారు. జిల్లా స్థాయి అపురూప అవార్డులు 2021 కందకుర్తి యాదవరావు, తాళ్ళ లక్ష్మీనారాయణగౌడ్‌, మేడిచర్ల ప్రభాకర్‌ రావు, అఖిలాండేశ్వరికి, 2022లో చిన్నికృష్ణుడు, ప్రభాదేవి, లలితావర్మ, డా.గణపతి, అశోకశర్మకు, 2023లో పొద్దుటూరి మాధవీలత, రచ్చ నరేశ్‌, డా.బలాష్ట్‌ మల్లేశ్‌, కళాగోపాల్‌కు అందించారు. అవార్డుల ప్రదానోత్పవానికి ముఖ్య అతిథిగా అధికార భాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ ఏనుగు నరసింహరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రతిభావంతులను ఎంపిక చేస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందించడం అభినందనీయమన్నారు. విశిష్ట అతిథి ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. సాహితీ సేవ, కళ రంగాలు మరుగునపడకుండా అమృత లత చేస్తున్న కృషి మరువలేనిదని, ఇలాంటి కార్యక్రమాల వల్లనే కళ ఇంకా బతికి ఉంటుందని, రాబోవు తరాలను అందించిన వారమవుతామని తెలిపారు. కార్యక్రమంలో కవులు, సాహితీ వేత్తలు వీపీ చందన్‌ రావు, నెల్లుట్ల రమాదేవి, డాక్టర్‌ కాసర్ల నరేష్‌ రావు, ఘనపురం దేవేందర్‌, గంట్యాల ప్రసాద్‌, డాక్టర్‌ త్రివేణి, మల్లవరవు చిన్నయ్య, దారం గంగాధర్‌, మేక రామ స్వామి, కర్క రమేష్‌, సాయి బాబు, లక్ష్మణ్‌, మల్లవరవు విజయ తదితరులు పాల్గొన్నారు.