తెలంగాణలో తొలి గజల్‌ కవయిత్రి ‘ఇందిర’ ఇక లేరు

– క్యాన్సర్‌తో మృతిచెందిన ఆమె
– సంతాపం ప్రకటించిన తెలంగాణ సాహితీ, టీఎస్‌యూటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలోనే తొలి గజల్‌ కవయిత్రి బైరి ఇందిర(60) ఇకలేరు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో ఆదివారం కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన బైరి ఇందిర తాను చూసిన అనుభవం లోకి వచ్చిన ఉదంతాలకు అక్షర రూపమిచ్చి కథానికలుగా తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి గజల్‌ కవయిత్రిగానూ ఆమె పేరుపొందారు.
ఇల్లెందులోని జెడ్పీహెచ్‌ఎస్‌ సుభాష్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా శాస్త్రీయ ఆలోచనలతో విద్యార్థులను తీర్చిదిద్దారు. ఒక వైపు ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రవృత్తిగా సాహిత్యాన్ని చివరి వరకు సమాజహితానికి అందించారు. 1998లో ‘తేనెల పలుకు’ కవిత్వానికి ఆస్ట్రేలియా అంతర్జాతీయ అవార్డు లభించింది. 2016లో విజయవాడ మానస సాహిత్య ఆకాడమీ జాతీయ స్థాయి అవార్డు దక్కింది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అంటేవుర్‌ రాష్ట్ర స్థాయి సాహిత్య అవార్డు, 2013లో కొత్తగూడెం ‘చిగురు సాహిత్య అకాడమీ’ నానో విభాగంలో అవార్డులు లభించాయి. ‘అలవోకలు’ వచన కవిత్వం, 2007లో, ‘అభిమతం’ 2016లో తొలి ‘తెలంగాణ గజల్‌ కావ్యం’ అచ్చయ్యాయి. 2021లో ‘అక్షింతలు’ మినీ కవితలు, ‘వలపోత’ కథలు, ‘మరోప్రారంభం’ కవిత్వం పుస్తకాలు వెలువరించారు. 2022 డిసెంబర్‌లో వురిమళ్ల ఫౌండేషన్‌ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ నివాళి
ప్రముఖ కవయిత్రి, తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ సభ్యురాలు బైరి ఇందిర మరణం సాహితి లోకానికి తీరని లోటని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభాపురం జనార్థన, కె. ఆనందాచారి అన్నారు. నిజాంపేటలోని ఆమె నివాసంలో ఆమె భౌతికకాయానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి, రాష్ట్ర కోశాధికారి అనంతోజు మోహన్‌ కృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి సలీమ, నగర నాయకులు శరత్‌ సుదర్శి, ఎం. రేఖ నివాళులు అర్పించారు.
సాహితి స్రవంతి సంతాపం
ఉమ్మడి రాష్ట్రంలో సాహితీ స్రవంతి కార్యకర్తగా ఖమ్మం, హైదరాబాద్‌లో జరిగిన జనకవనం, సాహిత్య కార్యశాలలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. తరువాత తెలంగాణా సాహితిలో ఉన్నారు. ఆవిడ మృతికి సాహితి స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్ష, కార్యదర్శులు కెంగార మోహన్‌, సత్యరంజన్‌, సాహిత్య ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ సత్యాజీ సంతాపం తెలిపారు.
అధ్యాపకులు ఎం.కోటేశ్వర్‌రావు, అభ్యుదయ రచయిత బైరి ఇందిర మరణాలకు టీఎస్‌యూటీఎఫ్‌ సంతాపం
అధ్యాపకులు ఎం. కోటేశ్వరరావు, బైరి ఇందిర మరణాల పట్ల టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.జంగయ్య, చావరవి సంతాపం ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.ఇరు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకులు మన్నెపల్లి కోటేశ్వరరావు (75) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఆంగ్ల అధ్యాపకునిగా పనిచేశారని తెలిపారు. అభ్యుదయవాదిగా, ఎస్‌ఎఫ్‌ఐ, యూటీఎఫ్‌ ఉద్యమాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. బైరి ఇందిర (60) ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారని పేర్కొన్నారు. టీఎస్‌ యూటీఎఫ్‌లో, అభ్యుదయ కవి, రచయిత్రి. సాహితీ స్రవంతి, అక్షరాస్యత, ప్రజాసైన్స్‌ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని గుర్తుచేశారు.