త్రిపురలో కొనసాగుతున్న బీజేపీ దుశ్చర్యలు

– ప్రతిపక్ష నాయుకులతో పాటు జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు
అగర్తలా : త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులు కొనసాగుతు న్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలకు చెందిన ఇండ్లతో పాటు, జర్నలిస్టుల ఇండ్లపైనా దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపైనా దాడులు చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ బోటాబోటీ అధిక్యం సంపాదించింది. ఫలితాలు వెల్లడైన దగ్గర నుంచి గతంకంటే ఎక్కువగా బీజేపీ మూకలు ప్రతిపక్షాల ఇండ్లపై దాడులు చేస్తున్నాయి. ప్రత్యేకించి వామపక్ష కార్యకర్తల ఇండ్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ దాడులకు తెగబడుతోంది. ఈ దాడుల కారణంగా పశ్చిమ త్రిపుర జిల్లాలో 144వ సెక్షన్‌ విధించారు. ఈ దాడులను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. కాగా, వామపక్ష కార్యకర్తల ఇళ్లపై దాడులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… జుబారాజ్‌నగర్‌లో కొత్తగా ఎన్నికైన సీపీఐ(ఎం) ఎమ్మెల్యే శైలేంద్రనాథ్‌కు చెందిన రబ్బర్‌ ప్లాంటేషన్‌కు కాషాయ మూక నిప్పు పెట్టింది. అగర్తలాలోని బదర్‌ఘాట్‌ ప్రాంతంలో సీపీఐ(ఎం) స్థానిక పార్టీ కార్యదర్శి శ్యామల్‌ రారు ఇంటిపైనా దాడి జరిగింది. ఇక అగర్తలలోని శ్రీపల్లిలో ప్రముఖ జర్నలిస్ట్‌ సమీర్‌ ధర్‌ ఇంటిపైనా దాడి చేశారు. ఒక్క శ్రీపల్లిలోనే ఐదుగురు సీపీఐ(ఎం) కార్యకర్తల ఇండ్లపై దాడులు జరిగాయి. కుమార్‌ఘాట్‌ డివిజన్‌లోని పెచర్‌తోల్‌, దూద్‌పూర్‌, దస్‌ఘరి ప్రాంతాల్లో బీజేపీ దాడికి తెగబడింది. ఇక దూద్‌పూర్‌లో ఇద్దరు సీపీఐ(ఎం) కార్యకర్తలను చితకబాదారు. అలాగే జిరానియా బజార్‌లోని చిత్తరంజన్‌ పల్లిలో రాణా చక్రవర్తి అనే స్కూల్‌ టీచర్‌ ఇంటిపైనా దాడి జరిగింది. బిషాల్‌గడ్‌లోని చరిలం ప్రాంతంలో సీపీఐ(ఎం) కార్యకర్తల 16 ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగి చేతులు విరగ్గొట్టారు. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లకుండా కూడా అడ్డుకున్నారు.. గర్జి ప్రాంతంలో ‘ప్రోతిబడి కోలోం’ అనే స్థానిక దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టు ఇంటిపైనా దాడి జరిగింది. అతని రబ్బరు తోటలకు బీజేపీ మూకలు నిప్పంటించడంతో అది పూర్తిగా కాలి బూడిదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖోవైలో బీజేపీ ఓడిపోయింది. నొగావ్‌ ప్రాంతంలోని సీపీఐ(ఎం) కార్యకర్తపై కొడవళ్లతో దాడి చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.