– 10 రోజుల్లో శంకుస్థాపనకు చర్యలు
– సంబంధిత అధికారులను ఆదేశించిన
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బలాలతో కలిసి పలు అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన సందర్భంగా ఆలయం అభివృద్ధి, విస్తరణ చేపడతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ హామీ మేరకు ఆలయ విస్తరణకు అవసరమైన 1100 గజాల స్థలాన్ని గుర్తించామని మంత్రి చెప్పారు. భూ యజమానులూ స్థలం అప్పగించేందుకు సానుకూలంగా ఉన్నారని వివరించారు. ఆలయ అభివృద్ధి కోసం భూమి అప్పగిస్తున్న వారికి పరిహారంగా ప్రభుత్వం రూ.8.95 కోట్లను మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంచన్‌బాగ్, ఉప్పుగూడ, జంగంమెట్‌లలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నామని వివరించారు. వివాహ, ఇతర శుభకార్యాలు జరుపుకునేందుకుగాను ఈ ఫంక్షన్ హాళ్ల కోసం రూ.19 కోట్లను మంజూరు చేశారని తెలిపారు. ఉప్పుగూడ హాల్‌కు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన రెండు హాల్స్‌కూ త్వరితగతిన టెండర్ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. అలాగే అమ్మవారి ఆలయ విస్తరణ అభివృద్ధికి సంబంధించి 10 రోజులలో భూమి పూజ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమోరు కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్స్ సీఈ జియా ఉద్దీన్, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.